20 మందిని చంపేసిన అ‘మాయకుడు’

Update: 2015-10-05 04:09 GMT
ఒకమ్మాయి ఆత్మహత్య చేసుకుంది సార్ అంటూ వచ్చిన ఫోన్ కాల్ తో అలెర్ట్ అయిపోయాడు ఇన్ స్పెక్టర్.  నోట్లో నుంచి నురగలు కక్కుతున్న ఆ అమ్మాయిని చూడగానే షాక్ తిన్నాడా ఇన్ స్పెక్టర్. పెళ్లికూతురులా ముస్తాబు అయిన ఆ అమ్మాయిని చూస్తుంటేనే విషయం అర్థమవుతోంది. పెళ్లి చేసుకోవటానికి రెఢీ అయి.. తేడా వచ్చేసరికి సూసైడ్ చేసుకుందని. గబగబా వెళ్లి ఆ అమ్మాయి చేయి పట్టుకొని.. నాడి చెక్ చేశాడు. అప్పటికే  ఆ అమ్మాయి చనిపోయి ఉంది. మరో షాక్ ఏమిటంటే.. ఆ అమ్మాయి ఎవరో తెలుసా అని అక్కడ గుంపుగా చేరిన వారిని అడిగితే ఎవరూ తమకు తెలీదని చెప్పటం.

ఈ ఘటనతో గజిబిజిగా తయారైన సదరు ఇన్ స్పెక్టర్ కు మరో చిక్కుముడి పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా ఎదురైంది. ఆ అమ్మాయి సైనేడ్ మింగి చనిపోయిందని డాక్టర్ చెప్పటంతో కంగుతిన్నాడు. పెళ్లి బట్టలతో.. మరి కాసేపట్లో పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలంటే.. సైనేడ్ అప్పటికప్పుడు ఎలా దొరికే అవకాశం ఉందన్న ప్రశ్న ఇన్ స్పెక్టర్ మదిలో మెదిలింది. పక్కనున్న సిబ్బంది సందేహాలు ఇన్ స్పెక్టర్ కు మరిన్ని సందేహాలు కలిగేలా చేశాయి.

ఇలా ఆలోచనలు సాగుతున్న సమయంలోనే.. డాక్టర్ చెప్పిన మాట మరింత ఆసక్తి రేకెత్తించింది. సర్.. ఇదే తీరులో ఆ మధ్యన ఓ అమ్మాయి పెళ్లి కూతురిగా ఆత్మహత్య చేసుకుంది. ఆ అమ్మాయి కూడా సైనేడ్ మింగి సూసైడ్ చేసుకుంది. నా స్నేహితుడే ఆ అమ్మాయి పోస్ట్ మార్టం చేశాడంటూ చెప్పిన డాక్టర్ మాటలకు.. ఎక్కడ ఉంటాడు ఆ డాక్టర్ అనగడటం.. కొల్లూరు అని చెప్పటం జరిగిపోయాయి.

ఇన్ స్పెక్టర్ మదిలో అస్పష్టంగా మెదిలిన సందేహానికి బలం చేకూరే మాటలతో మరిక ఆలస్యం చేయకుండా కొల్లూరు డాక్టర్ కు ఫోన్ చేయటం.. ఆ వెంటనే కొల్లూరు పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేస్తే.. పెళ్లికూతురుగా ఉన్న అమ్మాయి సైనేడ్ మింగి సూసైడ్ చేసుకుందని చెప్పటం.. వివరాలు అడిగితే.. తెలీదని చెప్పటం జరిగిపోయాయి.

మరిన్ని సందేహాల మధ్య ఇదే తీరులో కర్ణాటకలో ఇంకెవరైనా అమ్మాయిలు చచ్చిపోయారా అన్న సందేహానికి.. బుర్రతిరిగి పోయే సమాధానం వచ్చింది. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తీరులో అప్పటికి 20 మంది అమ్మాయి ఆత్మహత్యలు చేసుకున్నారని.. వారంతా పెళ్లికూతురు వేషంలోనే ఉన్నారని చెప్పటంతో అదిరిపాటుకు గురయ్యాడు ఇన్ స్పెక్టర్. అంటే.. ఎవరో ఒక దుర్మార్గుడు.. నమ్మించి అమ్మాయిల్ని ట్రాప్ చేసి.. చంపుతున్నాడన్న సందేహం కలిగింది.

2009లో జరిగిన ఈ ఉదంతం తర్వాత నాలుగు రోజుల పాటు.. సదరు ఇన్ స్పెక్టర్ వివిధ కోణాల్లో అమ్మాయిల సూసైడ్ మరణాలపై దృష్టి సారించాడు. వివిధ కోణాల్లో సమాచారాన్ని సేకరించాడు. అనంతరం మంగళూరులోని ఒక హోటల్ కు వెళ్లిన సిబ్బందితో వెళ్లిన సీఐకి.. వాడే సార్ అంటూ చెవిలో చెప్పటం.. క్షణం ఆలస్యం చేయకుండా వాడ్ని చుట్టుముట్టేయటం.. అమాయకంగా ఉన్న అతగాడు మారు మాట్లాడకుండా లొంగిపోవటం జరిగిపోయాయి.

ప్రాధమిక సమాచారంతో హోటల్ రూంలోకి పరుగులు పెట్టి.. ఒక గది తలుపు కొట్టారు. పెళ్లికూతురుగా ముస్తాబు అయిన ఆ అమ్మాయి టాబ్లెట్ వేసుకుంటే వారించారు. ఏం ట్యాబ్లెట్ అంటే.. కాంట్రాసెప్టిల్ పిల్ సర్ అంటూ మొహమాటంగా చెప్పిన ఆ అమ్మాయిని వారించి.. అది పిల్ కాదని సైనేడ్ ట్యాబ్లెట్ అని చెప్పటంతో సదరు అమ్మాయి షాక్ తింది.

ఇక.. అదుపులోకి తీసుకున్న అమాయకుడ్ని పోలీసులు.. తమదైన మార్క్ విచారణ చేయటంతో మొత్తం విషయాలు బయటకు రావటమే కాదు.. వారి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక.. ఆత్మహత్యలుగా భావించిన హత్యలు జరిగిన ప్రాంతాల్లో నిఘా పెడితే ఒక మందుల షాపు అతను ఈ మందు అమ్ముతున్నట్లు అర్థమై అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

సీన్ కట్ చేస్తే.. కర్ణాటకలోని బంట్వాల్ జిల్లాలో ఉన్న ఒక స్కూల్ పిటీ సార్ గా సుపరిచితుడు మోహన్. అమాయకత్వంతో.. నెమ్మదిగా ఉండే అతగాడంటే అందరికి మర్యాద.. గౌరవం. అసలు అలాంటి మంచి వ్యక్తి చాలా తక్కువగా ఉంటారని అతని స్నేహితులు.. బంధువులు..చుట్టుపక్కల వారంతా కాంప్లిమెంట్లు ఇవ్వటమే కాదు.. సర్టిఫై చేసేశారు. మళ్లీ అదే మోహన్ వ్యక్తి విషయాల్లోకి వెళితే.. అప్పటికే అతనికి ముగ్గురు భార్యలు.. పిల్లలు ఉన్నారు మరి.

మళ్లీ కాస్త వెనక్కి వెళితే.. హోటల్ లో పట్టుబడిన అమాయకుడు.. పీటీ టీచర్ అయిన మోహన్ ఒక్కరే. పైకి బుద్దిగా.. మంచోడికి మారుపేరుగా ఉండే మోహన్ మనసులో ఒక భయంకరమైన ఉన్మాది ఉన్నాడు. అమాయకులైన ఆడవాళ్లకు పెళ్లి పేరుతో పరిచయం చేసుకొని.. వారిని నమ్మించి.. చివరకు వారికి వారే ఇంట్లో నుంచి చెప్పకుండా బయటకు పారిపోయి వచ్చేలా చేసి.. వారు తెచ్చిన నగల్ని తీసుకొని.. వారికి ఏ మాత్రం సందేహం కలగకుండా పెళ్లి చేసుకునే ముందురోజు వారిని అనుభవించి.. పెళ్లి సమయానికి గర్భం రాకుండా ట్యాబ్లెట్లు వేసుకొమ్మని చెప్పటం.. ట్యాబ్లెట్ వేసుకున్న క్షణాల్లో మరణించిన వెంటనే.. ఏమీ ఎరగనట్లుగా పారిపోవటం అతడికి అలవాటు. అలా అతను 20 మంది అమాయక మహిళల్ని చంపేశాడు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో మోహన్  కు ఉరిశిక్షను వేశారు. ప్రస్తుతం 52 ఏళ్ల ఈ అమాయక మృగం కర్ణాటకలోని ఒక జైల్లో ఉంది. చట్టంలోని సెక్షన్లతో ఏదో విధంగా తన ఉరి కాస్తా యావజ్జీవం కాకుండా పోతుందా? అన్న ఆశతో అ‘మాయక’ మోహన్ ఉండే. బాధిత కుటుంబాలు మాత్రం వాడి చావు ఎప్పుడని ఎదురుచూస్తున్నారు. తన చుట్టు ఉన్నవారు.. తనను తెలిసిన వారందరికి మంచివాడిగా తెలిసిన మోహన్ మనసులో ఇంత పెద్ద రాక్షసుడు ఉన్నాడని తెలిసిన ప్రతిఒక్కరూ షాక్ తినటమే కాదు.. ఆ మానవమృగానికి వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని కోరుకుంటారు. మరి.. చట్టం ఈ సైనేడ్ సైకో మోహన్ ని ఎప్పుడు ఉరి తీస్తుందో? ఇలాంటి వాడి విషయంలో శిక్ష వెనువెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉంది కదూ.
Tags:    

Similar News