చంద్రబాబుతో ఇద్దరు సీనియర్ల సీరియస్ చర్చ

Update: 2021-05-31 05:38 GMT
మహానాడు వేదికగా తెలుగు తమ్ముళ్లు అంతా అన్నయ్య చంద్రబాబుతో కష్టసుఖాలు పంచుకున్నారు. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఇప్పుడు టీడీపీని ఎలా పట్టాలెక్కించాలి? ఎలా బలమైన జగన్ ను ఓడించాలన్న దానిపైనే మహానాడులో చంద్రబాబు అండ్ కో శూలశోధన మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. రెండు రోజుల వర్చువల్ మహానాడు సందర్భంగా తేల్చింది ఒకటేనట.. చాలావర్గాలు టీడీపీకి దూరమైపోయారని.. ఆ సామాజికవర్గాలను తిరిగి టీడీపీకి దగ్గరి చేయడంపైనే చంద్రబాబు ఫోకస్ చేశారట..

ఈ సందర్భంగా చంద్రబాబు టీడీపీ సీనియర్లు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిల మధ్య ఆసక్తికర చర్చ సాగినట్టు సమాచారం.

సోమిరెడ్డి మాట్లాడుతూ జగన్ గెలుపునకు టీడీపీ కి మద్దతిచ్చిన ఆ సామాజికవర్గాలే కారణమన్నారు. ముఖ్యంగా క్రిస్టియన్లు, ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి సామాజికవర్గాలు టీడీపీ పూర్తిగా దూరమయ్యాయని ఆయన కుండబద్దలుకొట్టారు. పార్టీ పెట్టినప్పటి నుంచి అండగా ఉన్న ఎస్టీలు, ముస్లింలు ఈసారి వైసీపీకి వెళ్లిపోయారని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. వారిని ఆదరించాలని సోమిరెడ్డి పట్టుబట్టారు.

అయితే సోమిరెడ్డి వాదనను చంద్రబాబు, యనమల అంగీకరించలేదు. పైకులాలకు టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని ఒప్పుకున్నట్లు అవుతుందని యనమల ఖండించారు. ఆ తీర్మానం పెడితే మనమే వారిని విస్మరించారనే సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందన్నారు. అధికారంలోకి వచ్చాక వారిని ఆదుకుంటే మేలు జరుగుతుందని యనమల చెప్పుకొచ్చారు.

అయితే సోమిరెడ్డి మాత్రం ఆయా వర్గాలకు భరోసా కల్పిస్తేనే టీడీపీకి షిఫ్ట్ అవుతారని వాదించారు. వాళ్లకు నమ్మకం కలిగించాలన్నారు. కానీ చంద్రబాబు, యనమల ససేమిరా అన్నారట.. దీన్ని టీడీపీకి చాలా వర్గాలు దూరమయ్యాయని.. ఆ నిజాన్ని చంద్రబాబు అండ్ కో అంగీకరించడం లేదన్న వాస్తవం బయటపడింది.
Tags:    

Similar News