సీఎంపై సోష‌ల్ మీడియా కామెంట్లు..ఏడుగురికి జైలు

Update: 2017-03-26 05:41 GMT
సోష‌ల్ మీడియా విస్తృతి పెరిగిపోవ‌డంతో మ‌న‌సులో అనుకున్న‌ది అభిప్రాయం రూపంలో వ్య‌క్తం చేయ‌డం చాలా సుల‌భం అయిపోయింది. ఇలా వ్య‌క్త‌ప‌ర్చ‌డం పోస్ట్ రూపంలో కావ‌చ్చు - కామెంట్ రూపంలో అయినా అయి ఉండ‌వ‌చ్చు. అయితే ఇలా సోష‌ల్ మీడియా వేదిక‌లైన ఫేస్‌ బుక్‌ - ట్విట్ట‌ర్‌ - వాట్సాప్‌ - ఇన్ స్టాగ్రాం వంటి వాటిల్లో నోరు జారి బుక్క‌యిపోవ‌డ‌మే కాదు ఏకంగా జైలు పాల‌యిన వారు ఉన్నారు. రాజకీయ నాయకులపై ఫేస్‌ బుక్‌ లో వివాదాస్పద - అభ్యంతరకర వ్యాఖలు రాస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందుకు కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు చూపిస్తున్నారు.

కొత్తగా ఎన్నికైన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేసినందుకు ఈవారం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు!మార్చి 21న యూపీ సీఎంగా ఆదిత్యనాథ్ ప్రమాణం చేసిన తరువాత ఆ రాష్ర్టానికి చెందిన నలుగురు వ్యక్తులు ఫేస్‌ బుక్‌ లో ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు చేయడంతో అరెస్టయ్యారు. యోగిని అవమానకరంగా చూపినందుకు బెంగళూరు మహిళపై ఎఫ్‌ ఐఆర్ దాఖలైంది. తాజాగా రహత్‌ ఖాన్ (22) అనే వ్య‌క్తిని గ్రేటర్ నొయిడా పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఇదేమీ కొత్త కాద‌ని అంటున్నారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి. మార్చి 2015లో అప్పటి యూపీ మంత్రి ఆజమ్‌ ఖాన్‌ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు 11వ తరగతి విద్యార్థి జైలుపాలయ్యాడు. ఆగస్టు 2014లో ప్రధాని మోడీని అవమానించేలా ఫోటోలు - వ్యాఖ్యలు పోస్ట్ చేయడంతో సీపీఎం కార్యకర్త రాజేశ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడు చేసిన పోస్టులు మత కలహాలను ప్రేరేపించేలా ఉన్నాయని పోలీసులు చెప్పారు. అదే ఏడాది మేలో గోవాలో మోడీకి వ్యతిరేకంగా ఫేస్‌ బుక్‌ లో వ్యాఖ్యలు రాసిన ఓడనిర్మాణ వ్యాపారి దేవు చోదండ్‌ కర్‌ పై పోలీసులు ఎఫ్‌ ఐఆర్ నమోదు చేశారు.

2012 నవంబర్‌ లో దివంగత శివ్‌సేన అధినేత బాల్‌ ఠాక్రే అంత్యక్రియల సమయంలో ముంబై నగర బంద్‌ కు పిలుపునివ్వడాన్ని ఫేస్‌ బుక్‌ లో ప్రశ్నించినందుకు ఇద్దరు బాలికలు షహీన్ ధాడ - రేణు శ్రీనివాసన్ అరెస్టయ్యారు. భయం వల్లే నగరాన్ని బంద్ చేశారని, గౌరవంతో కాదని ఒకరు వ్యాఖ్య రాయగా, మరొకరు దానిని లైక్ చేశారు. అక్టోబర్ 2012లో కాంగ్రెస్ నాయకుడు చిదంబరం కొడుకు కార్తిపై ట్విట్టర్‌ లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు పుదుచ్చెరి వ్యాపారవేత్త రవి శ్రీనివాసన్ జైలుపాలయ్యారు. 2012 మేలో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పై జోకులు పేల్చినందుకు ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది మయాంక్ మోహన్‌ శర్మ - కేజీజే రావ్‌ ను ముంబై సైబర్‌ క్రైమ్ పోలీసులు జైలులో పెట్టారు. 2012 ఏప్రిల్‌లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై వ్యంగ్యచిత్రం పోస్ట్ చేసినందుకు జాదవ్‌ పూర్ విశ్వవిద్యాలయం ఆచార్య అంబికేశ్ మహాపాత్ర - ఆయన పొరుగు వ్యక్తి సుబ్రతా సేన్‌ గుప్తా అరెస్టయ్యారు. కాబట్టి రాజకీయ నాయకులపై ఫేస్‌ బుక్‌ లో కామెంట్లు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News