నీటి కొర‌త వేళ‌.. రామేశ్వ‌రంలో మాత్రం అద్బుతం!

Update: 2019-06-20 05:01 GMT
ముబ్బుల వెనుక దాగి ఉన్న వాన ఎంత‌కూ కింద‌కు రానంటే రానంటున్న పరిస్థితి. జూన్ వ‌చ్చిందంటే చాలు.. వ‌ర్షాలు ప‌డే ప‌రిస్థితికి భిన్నంగా జూన్ మూడో వారంలోకి అడుగు పెట్టిన త‌ర్వాత కూడా వాన జాడ లేని ప‌రిస్థితి. దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో తీవ్ర నీటి ఎద్ద‌డి నెల‌కొంది. త‌మిళ‌నాడులోని చెన్నై మ‌హాన‌గ‌రంలో నీటి కోసం అక్క‌డి ప్ర‌జ‌లు ప‌డుతున్న తిప్ప‌లు అన్ని ఇన్ని కావు.

ఇలా నీటి కోసం నానా ఆగ‌చాట్లు ప‌డుతున్న వేళ‌.. ఇందుకు భిన్నంగా ఉన్న ప‌రిస్థితి రామేశ్వ‌రంలో క‌నిపిస్తోంది. అద్భుత‌మా?  దేవుడి మ‌హ‌త్య‌మా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. త‌మిళ‌నాడులోని రామేశ్వ‌రంలోని అరుల్ మిగు రామ‌నాథ స్వామి టెంపుల్లోని 22 బావుల్లో నీరు నేటికి సంవృద్ధిగా ఉండ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

దేశ వ్యాప్తంగా నీటి మ‌ట్టాలు త‌గ్గిపోతున్న వేళ‌.. అందుకు భిన్నంగా రామ‌నాథ స్వామి ఆల‌యంలోని బావుల్లో నీరు పుష్క‌లంగా ఉండ‌టం ప‌లువురిని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. దీన్ని చూసేందుకు ప‌ర్యాట‌కులు మ‌రింత‌గా వ‌స్తున్నారు. తీర్థంలో పుణ్య‌స్నానాలు చేసే వారు ఎక్కువ‌య్యారు.

ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో విష‌యం ఏమంటే.. ఈ గుడి ప్రాంగ‌ణంలోని 22 బావుల్లో నీటి రుచి వేర్వేరుగా ఉండ‌టం విశేషం. కొన్ని బావుల్లో నీరు తియ్యగా ఉంటే.. మ‌రికొన్నింట్లో ఉప్ప‌గా.. ఇంకొన్నిట్లో  మామూలుగా ఉండ‌టం క‌నిపిస్తోంది. శ్రీ‌రాముడు.. సీతాదేవిలు స్వ‌యంగా ఈ ఆల‌యంలోని శివ‌లింగాల‌ను ప్ర‌తిష్ఠించిన‌ట్లుగా ఇక్క‌డి ఆల‌య పురాణం చెబుతోంది.

పేరుకు రామ‌నాథ స్వామిగా చెప్పినా.. ఇక్క‌డ ఉండేది మాత్రం శివుడు కావ‌టం మ‌రో విశేషంగా చెప్పాలి. ఇంత సైన్స్ అందుబాటులోకి వ‌చ్చాక‌.. ఇక్క‌డ మాత్రం నీరు ఎందుక‌ని పుష్క‌లంగా ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గానే మిగిలిపోయింది.

Tags:    

Similar News