కెప్టెన్ త‌న‌యుడు పార్టీ ప‌గ్గాలు

Update: 2016-05-28 05:08 GMT
డీఎండీకే అధినేత - విజ‌య్‌ కాంత్ మ‌రో కీల‌క అడుగు వేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. సినిమారంగంలో కుమారుడు షణ్ముఖపాండియన్ త‌న‌ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నేపథ్యంలో ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకువ‌చ్చేందుకు కెప్టెన్ సిద్ధ‌మ‌య్యారు. చిత్రంగా తాజా ఎన్నిక‌ల్లో ఓట‌మి నేప‌థ్యంలో డీఎండీకే శ్రేణుల నుంచే ఈ డిమాండ్ రావ‌డం ఆస‌క్తిక‌రం. తాజా శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఒక్క‌చోట కూడా గెలువ‌క‌పోవ‌డం - ఓటుబ్యాంకుకు భారీగా గండిపడిన నేప‌థ్యంలో మూడు విడతలుగా పార్టీ జిల్లా కార్యదర్శులతో విజయకాంత్ సమాలోచనలు నిర్వహిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ‘కెప్టెన్ రాజకీయ వారసుడు’ వ్యవహారం తెరపైకి వచ్చింది.

కెప్టెన్ కుమారుడు షణ్ముఖపాండియన్‌ ను రాజకీయాల్లోకి తీసుకురావాలనే వాదనను జిల్లా కార్యదర్శులు బలంగా వినిపించార‌ని స‌మాచారం. ప్రజలను ఆకట్టుకోవడానికి రాజకీయాల్లో వారసత్వం ఉండాలంటూ డీఎంకే-పీఎంకే వంటి పార్టీల్లో పార్టీ నాయకులకు వారి వారసులు అండదండలుగా ఉంటూ పార్టీ అభివృద్ధికి పాటుపడుతున్న విషయాన్ని వారు బ‌లంగా వినిపించార‌ట‌. శాసనసభ ఎన్నికల స‌మ‌యంలో షణ్ముఖపాండియన్‌ ను రాజకీయప్రవేశం చేయించి ఉంటే ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవంటూ కార్య‌ద‌ర్శులు తెలిపారు.

ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని ఇప్పటి నుంచే షణ్ముఖపాండియన్‌ ను తీర్చిదిద్దితే స్థానిక సంస్థల ఎన్నికలు - 2019 ఎన్నిక‌ల నాటికి డీఎండీకేకు తురుపుముక్క లభించినట్లవుతోందని వారు ధీమా వ్య‌క్త చేశార‌ట‌. జిల్లా కార్యదర్శుల్లో అత్యధికులు షణ్ముఖపాండియన్ రాజకీయ ప్రవేశం అభిప్రాయాన్ని వక్కాణిస్తుండటంతో దీనిపై విజయకాంత్ కూడా దృష్టి సారించారని వినికిడి. అయితే షణ్ముఖపాండియన్‌ ను ఇప్పుడే రాజకీయాల్లోకి తీసుకువస్తే సినిమారంగంలో ఆయన ఎదుగుదల ప్రశ్నార్థకం కావచ్చనే ఆందోళన కెప్టెన్ నెలకొందని సమాచారం. దీంతో ఈ విషయాన్ని పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు - తన బావమరిది ఎల్.కె.సుదీష్ చెంతకు తీసుకెళ్లారని - షణ్ముఖపాండియన్ కెరీర్ దృష్ట్యా లాభనష్టాలు బేరీజు వేసుకుని త్వరలో నిర్ణయం ప్రకటిస్తారని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.
Tags:    

Similar News