మాల్యా విషయంలో అలా.. శరద్ కు మరోలా

Update: 2017-12-18 23:30 GMT
ఇటీవల రాజ్యసభలో వేటుకు గురైన జేడీ(యూ) మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్‌, దేశ రాజకీయాల్లో సీనియర్ నేతల్లో ఒకరైన శరద్ యాదవ్ వ్యవహారం చర్చకు దారితీస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో నితీశ్ నేతృత్వంలోని జేడీ(యూ) జత కట్టడం నచ్చని యాదవ్ జేడీయూ సభ్యత్వాన్ని స్వచ్ఛంగా వదులుకున్నారు. దీంతో జేడీయూ... శరద్ యాదవ్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాజ్యసభ ఛైర్మన్ ను కోరింది. రాజ్యసభకు ఏ పార్టీ నుంచి ఎన్నికయ్యారో, ఆ పార్టీనే వీడడంతో సభ్యత్వం రద్దు చేయాలన్నది అక్కడ పాయింట్. దీంతో రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు శరద్‌ యాదవ్‌ సభ్యత్వాన్ని రద్దు చేశారు.
    
మరోవైపు శరద్‌ యాదవ్‌ సభ్యత్వాన్ని రద్దు ఉత్తర్వుల వ్యవహారం ఢిల్లీ హైకోర్టుకు చేరింది. ఎంపీ పదవిలో ఉన్నప్పుడు ఆయనకు లభించిన జీతభత్యాలు, బంగళా సహా ఇతర సదుపాయాలన్నీ ఈ కేసులో తుది తీర్పు వచ్చేవరకు కొనసాగుతాయి.. కేసు తుది విచారణ మార్చి 1న మొదలవుతుంది...
    
ఇదంతా బాగానే ఉన్నా అసలు శరద్ యాదవ్ సభ్యత్వ రద్దు విషయంలో అంత వేగంగా చర్యలు తీసుకోవడానికి... ఇంతకుముందు విజయ్ మాల్యా విషయంలో వ్యవహరించిన తీరును పోల్చుతున్నారు రాజకీయ పరిశీలకులు. శరద్ యాదవ్ ఏమీ వివాదాస్పద నేత కాదు, రాజకీయంగా వైరుధ్యాలుండొచ్చేమో కానీ నేర చరిత్ర వంటివేమీ లేవు. ఏడు సార్లు లోక్ సభకు, రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికైన సీనియర్ నాయకుడు. దేశంలోని అనేక రాజకీయ పార్టీలతో కలిసి నడిచిన అనుభవశీలి. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులు కూడా అందుకున్న వ్యక్తి. కానీ... బీహార్లో రాజకీయ సమీకరణాలు మారడం, దానికి కేంద్రంలోని బీజేపీకి సంబంధం ఉండడం వంటివన్నీ ఇందులో కీలక పాత్ర పోషించాయంటున్నారు.
    
కానీ, విజయ్ మాల్యా విషయంలో ఏం జరిగింది. వేల కోట్లకు బ్యాంకులను ముంచి లండన్ పారిపోయిన మాల్యా రాజ్యసభకు తన రాజీనామా పంపించారు. కానీ.. ఎథిక్స్ కమిటీ దాన్ని తిరస్కరించింది. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది. అయితే, ఇందుకు సమయం పట్టింది. కానీ... శరద్ యాదవ్ విషయంలో అంతా ఆగమేఘాలపై జరిగిపోయింది.
    
అయితే.. మాల్యా వ్యవహారం జరిగే నాటికి రాజ్యసభలో బలాబలాలు... అప్పటికి రాజ్యసభ ఛైర్మన్‌గా ఉన్న హమీద్ అన్సారీ గత రాజకీయ నేపథ్యం.. ప్రస్తుత ఛైర్మన్ వెంకయ్యనాయుడు గత రాజకీయ నేపథ్యం వంటివన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి. ఆ క్రమంలోనే మాల్యాలాంటి ఆర్థిక నేరగాడి సభ్యత్వ రద్దుకు అంత సమయం పట్టగా ఇప్పుడు శరద్ యాదవ్ వంటి రాజకీయ ప్రత్యర్థి విషయంలో ఇంత సత్వర స్పందన వచ్చిందనుకోవాలి.
Tags:    

Similar News