`సాక్షి`కి నేనూ ఓన‌ర్‌నే.. ష‌ర్మిల సంచ‌ల‌న కామెంట్లు!

Update: 2021-09-23 00:30 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి.. వైఎస్ త‌న‌య.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు.. ష‌ర్మిల మ‌రోసారి సెంట‌రాఫ్‌ది.. టాపిక్‌గా మారారు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఏదో ఒక రూపంలో ఆమె ఉద్య‌మాలు చేస్తున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు స్పృశించ‌ని.. అనే విష‌యాల‌పై ఆమె త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను బ‌య‌ట పెట్టారు. వాస్త‌వానికి ష‌ర్మిల పార్టీ పెట్ట‌డం.. వైసీపీ అధినేత‌గా.. జ‌గ‌న్‌కు ఇష్టం లేదు. తెలంగాణ‌లో త‌న సోద‌రి చ‌క్రం తిప్ప‌డం వ‌ల్ల ఏపీకి ఇబ్బందులు వ‌స్తాయ‌ని ఆయ‌న ప‌రోక్షంగా చెప్పుకొస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పార్టీ పెట్ట‌డాన్ని వ్య‌తిరేకించారు.

అన్నీ వ్య‌తిరేక‌త‌లే..

అయిన‌ప్ప‌టికీ.. ష‌ర్మిల మాత్రం పార్టీ ఏర్పాటు చేశారు. ఈ విష‌యంలో ఆమె త‌న నిర్ణ‌యాన్ని విర‌మించుకోలేదు. అంతేకాదు.. త్వ‌ర‌లోనే(అక్టోబ‌రు 20 అని ప్ర‌క‌టించారు) ఆమె పాద‌యాత్ర కూడా చేయ‌నున్నారు. చేవెళ్ల నుంచి ప్రారంభించే ఈ పాదయాత్ర దాదాపు 90 నియోజకవర్గాల్లో కొనసాగనుంది. అయితే, చెప్పుకోదగిన నేతలు..కేడర్ లేకుండా తెలంగాణ లో బలమైన పార్టీలతో షర్మిల ఢీ కొంటున్నారు. అంతేకాదు.. ఏపీ సీఎంగా ఉన్న అన్న‌ జగన్ మ‌ద్ద‌తు లేదు. పోనీ.. త‌ల్లి విజ‌య‌మ్మ మ‌ద్ద‌తు ఉన్నా.. ఆమె ఇంకా వైసీపీ గౌర‌వ అధ్య‌క్షురాలిగా కొన‌సాగుతున్నారు. మ‌రోవైపు.. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. ప్ర‌శాంత్ కిశోర్ కూడా వైసీపీ త‌ర‌ఫున ప‌నిచేసేందుకు త్వ‌ర‌లోనే ఏపీలో రంగంలోకి దిగుతున్నార‌ని స‌మ‌చారం.

తీవ్ర ఉత్కంఠ‌!

ఇన్ని ప‌రిణామాల‌కు తోడు.. తెలంగాణ‌లో తాను చేస్తున్న కార్య‌క్ర‌మాల‌కు సొంత మీడియా అయిన‌.. సాక్షిలో క‌వ‌రేజీ రావ‌డం లేదు. అయినా.. కూడా ష‌ర్మిల మ‌డ‌మ తిప్ప‌కుండా.. తాను తెలంగాణ కోడ‌లినంటూ దూకుడు చూపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అస‌లు ఇన్ని ఎలా త‌ట్టుకుంటారు? ఏ విధంగా ముందుకు సాగుతారు? అనేది ఆస‌క్తిగామారింది. ఈ క్ర‌మంలోనే ఓ ఇంట‌ర్వ్యూలో ష‌ర్మిల ఆయా అంశాల‌పై స్ప‌ష్ట‌త ఇచ్చారు.

సాక్షికి కో ఓన‌ర్‌!
తొలుత సాక్షి విష‌యాన్ని ప్ర‌స్తావించిన ష‌ర్మిల‌.. ఈ మీడియా సంస్థ‌కు తాను స‌హ య‌జ‌మాని(కో ఓనర్))న‌ని చెప్పుకొచ్చారు. మ‌ని క‌వ‌రేజీ ఇవ్వ‌డం లేద‌న్న ప్ర‌శ్న‌కు మాత్రం.. ఆమె మౌనంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, మాతృమూర్తి విజ‌య‌మ్మ‌.. వైఎస్సార్ సతీమణిగా తన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటూ వివ‌ర‌ణ ఇచ్చారు. వైఎస్సార్ వర్దంతి రోజున షర్మిల వైఎస్సార్ ఆత్మీయులతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ స‌మావేశానికి ష‌ర్మిల హాజ‌ర‌య్యారు. వైఎస్ అనుచ‌రుల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేశారు. తెలంగాణ‌లో వైఎస్సార్ పాల‌న అందిస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

ప్ర‌శాంత్ కిశోర్ హామీ ఇచ్చారు..

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. ప్ర‌శాంత్ కిశోర్ గురించి ష‌ర్మిల మాట్లాడుతూ.. ``ప్రశాంత్ భయ్.. నా పార్టీకి పని చేస్తానని ప్రామిస్ చేశారు. త్వరలోనే బాధ్య‌త‌లు తీసుకుంటారు`` అని వివ‌రించారు. అంటే.. అటు ఏపీలో జ‌గ‌న్‌కు ఇటు తెలంగాణ‌లో ష‌ర్మిల‌కు కూడా పీకే ప‌నిచేస్తార‌ని స్ప‌ష్ట‌మైంది.

పాద‌యాత్రలు అందుకే!

పాద‌యాత్ర‌ల‌కు పెట్టిందిపేరైన వైఎస్ ఫ్యామిలీలో ఇప్పుడు ష‌ర్మిల కూడా పాద‌యాత్ర‌కు రెడీ అవుతున్నారు అయితే.. దీనిపై ఆమె ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. పాదయాత్రలు చేస్తే సీఎంలు కారని షర్మిల వ్యాఖ్యానించారు. పాదయాత్రల ద్వారా జనం సమస్యలు గుర్తించి.. పరిష్కారం పై భరోసా కల్పిస్తే అవి ఓట్లుగా వస్తాయని విశ్లేషించారు. తనకు పార్టీలో బలమైన నేతలు లేకున్నా...తమ పార్టీ బలం వైఎస్సార్ అని.. తన బలగం వైఎస్సార్ అభిమానులని షర్మిల చెప్పుకొచ్చారు.

అనేక చిక్కులు!

ష‌ర్మిల అభిప్రాయ‌లు ఓకే! కానీ.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం ఆమెకు చిక్కులు త‌ప్ప‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. షర్మిల పార్టీకి సైతం ప్రశాంత్ కిషోర్ సేవలు అందించేందుకు ముందుకు వస్తే మరి..జగన్ ఆయన సేవలు కంటిన్యూ చేస్తారా..లేక తన నిర్ణయం మార్చుకుంటారా.. లేక ప్ర‌శాంత్‌ను ష‌ర్మిల సేవ‌ల నుంచి క‌ట్ట‌డి చేస్తారా? అనేది ఆస‌క్తిగా మారింది. అదేవిధంగా ప్ర‌స్తుతం వైసీపీ గౌర‌వ అధ్య‌క్షురాలిగా ఉన్న విజ‌య‌మ్మ‌.. రేపు ష‌ర్మిల పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తే.. జ‌గ‌న్ ఆమెను ఆ ప‌ద‌విలో ఉండ‌నిస్తారా? ఇక‌, పాద‌యాత్ర‌లు స‌క్సెస్ అయినా.. సీఎం అవ‌లేర‌ని చెబుతున్న వ్యాఖ్య‌లు ప్ర‌జ‌ల్లోకి వెళ్తే.. మైన‌స్‌లు కావా? ఇవీ.. ఇప్పుడు ష‌ర్మిల‌కు ఎదుర‌వుతున్న కీల‌క చిక్కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


Tags:    

Similar News