బీజేపీ సొంత ‘శత్రు’వు కామెంట్లు విన్నారా..

Update: 2018-02-03 16:51 GMT
ప్రధాని మోదీని విమర్శించడానికి ఏ చిన్న అవకాశం దొరికినా విరుచుకుపడే ఆ పార్టీ అసమ్మతి ఎంపీ శత్రుఘ్నసిన్హా మరోసారి ట్వీట్ అటాక్ చేశారు. రాజస్థాన్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి నేపథ్యంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీకి ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన తొలి రాష్ట్రం రాజస్థానేనంటూ ఆయన ట్వీట్ చేశారు.
    
తాజా ఫలితాల తరవాతైనా పార్టీ మేలుకోవాలని.. నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే దారుణంగా దెబ్బతింటామని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలో ‘‘బ్రేకింగ్‌ న్యూస్‌... అధికార పార్టీకి విపత్కర ఫలితాలు వచ్చాయి. బీజేపీకి ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన మొదటి రాష్ట్రంగా రాజస్థాన్‌ నిలిచింది. అజ్మీర్‌ తలాక్‌ - అల్వార్‌ తలాక్‌ - మండల్‌ గఢ్‌ తలాక్‌. మన ప్రత్యర్థులు రికార్డు మెజారిటీతో ఎన్నికలను గెలుస్తూ.. మనకు ఝలక్‌ ఇస్తున్నారు’’ అంటూ శత్రుఘ్న శనివారం ట్వీట్‌ చేశారు.
    
ఇటీవల వెలువడిన రాజస్థాన్‌ ఉప ఎన్నికల ఫలితాల్లో పాలక బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే.  కీలకమైన ఉప ఎన్నికల్లో కమలనాథులు అక్కడ బొక్కబోర్లా పడ్డారు.ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యంగా పుంజుకొని మండల్‌గఢ్‌ అసెంబ్లీ స్థానంలో, అజ్మీర్‌ - అల్వార్‌ లోక్‌సభ స్థానాల ఉప ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించింది. ఈ ఫలితాలు వసుంధరారాజే ప్రభుత్వానికి గట్టి షాక్‌ ఇచ్చాయి. అయితే.. వసుంధరపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వచ్చిందని... పార్టీలోనూ ఆమెను వ్యతిరేకించేవారు ఎక్కువగా ఉన్నారని... ఆ క్రమంలో దిల్లీ నుంచి బీజేపీ పెద్దలెవరూ ఈ ఉప ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదని, ప్రచారానికి వెళ్లలేదని... వసుంధరకు అర్థం కావాలనే ఉద్దేశంతోనే పార్టీలో అక్కడ పోతేపోనీ అనే ధోరణిలో వ్యవహరించిందన్న వాదనా ఒకటి ఉంది.

Tags:    

Similar News