ప‌వ‌న్ @ రాజ‌కీయ ముఖ చిత్రంపై చెర‌గ‌ని సంత‌కం!

ఇంకో ర‌కంగా చెప్పాలంటే.. 2024 రాజ‌కీయ ముఖ చిత్రంపై ప‌వ‌న్ క‌ల్యాణ్‌ది చెర‌గ‌ని సంత‌కంగానే చెప్పాలి. కూట‌మి క‌ట్ట‌డంలో ఆయ‌న అనేక రూపాల్లో ఓర్పు వ‌హించారు.

Update: 2025-01-01 00:30 GMT

ఒక్క ఏపీలోనే కాదు.. దేశంలోనూ.. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరు మార్మోగిన సంవ‌త్స‌రం 2024. ఏపీలో ప్ర‌భుత్వ ఏర్పాటుతోపాటు.. కేంద్రంలోనూ ఎన్డీయే కూట‌మి మోడీ స‌ర్కారునునిల‌బెట్ట‌డంలోనూ ప‌వ‌న్ పాత్ర అజ‌రామ‌ర‌మ‌నే చెప్పాలి. ఇంకో ర‌కంగా చెప్పాలంటే.. 2024 రాజ‌కీయ ముఖ చిత్రంపై ప‌వ‌న్ క‌ల్యాణ్‌ది చెర‌గ‌ని సంత‌కంగానే చెప్పాలి. కూట‌మి క‌ట్ట‌డంలో ఆయ‌న అనేక రూపాల్లో ఓర్పు వ‌హించారు. ఒకానొక ద‌శ‌లో కేంద్రంలోని పెద్ద‌ల కోసం గంట‌ల త‌ర‌బ‌డి వేచి చూశారు.

తానే చెప్పుకొన్న‌ట్టుగా.. అనేక అవ‌మానాలు.. మాట‌లు కూడా ప‌డ్డారు. మొత్తంగా కూట‌మి క‌ట్టేందుకు అటు బీజేపీని ఒప్పించన‌ప్పుడు.. ప‌వ‌న్‌పై అనేక వ్యాఖ్య‌లు వ‌చ్చాయి. బీజేపీ నాయ‌కులే.. త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చార‌ని.. బీజేపీ జాలి చూపించింద‌ని.. వ్యాఖ్యానించారు. కానీ, ప‌వ‌న్ వేసిన వ్యూహం.. క‌ట్టిన కూట‌మితో ఎక్కువ‌గా ల‌బ్ధి పొందింది.. బీజేపీనే. ప‌వ‌నే లేక‌పోతే.. కేంద్రంలో మోడీ స‌ర్కారును మూడోసారి ఊహించ‌డ‌మే క‌ష్టంగా ఉండేది. తాజాగా 2024లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మి మెజారిటీ ద‌క్కించుకుంది.

దీంతో ప్ర‌ధానంగా 16 మంది ఎంపీల‌తో టీడీపీ అతి పెద్ద మిత్ర‌ప‌క్షంగా ఉంది. ఇదే టీడీపీతో చెలిమి కోసం క‌మ‌ల నాథులు వెనుకాడిన‌ప్పుడు.. ముందుండి భ‌రోసా ఇచ్చింది..బ్ర‌తిమ‌లాడింది ప‌వ‌నే కావ‌డం విశే షం. అప్పట్లో ప‌వ‌న్ చేసిన ప్ర‌య‌త్నాన్ని చుల‌క‌న‌గా చూసిన‌.. క‌మ‌ల నాథులు నేడు ఆయ‌న ఆహ్వానాలు ప‌లుకుతున్నారు. అంద‌లం ఎక్కించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక‌, రాష్ట్రంలోనూ అనేక ప్ర‌య‌త్నాలు.. సంయ‌మ‌నాలు త‌ప్ప‌లేదు. మొత్తంగా టీడీపీతో జ‌న‌సేనకు పొత్తు కుదిరిన‌ప్పుడు వ‌చ్చిన విమ‌ర్శ‌లు అన్నీ ఇన్నీ కాదు.

ముఖ్య‌మంత్రి పీఠం మీరుతీసుకోవాల‌ని కొంద‌రు ప్ర‌బుద్ధులైన కాపు పెద్ద‌లు రాసిన లేఖ‌లు.. రాజ‌కీయ సంచ‌నాల‌కు వేదిక‌గా మారాయి. సీట్ల లెక్క‌ల విష‌యంలోనూ ప‌వ‌న్‌కు వారు సుద్దులు చెప్పారు. ఇవ‌న్నీ.. ఒక‌ర‌కంగా ప‌వ‌న్‌కు ఎదురైన సంక్లిష్ట ప‌రిస్థితులు. అయినా.. త‌న‌దైన ప‌ట్టుద‌ల‌, పంతం.. అన్నింటికీ మించిన ద్రుఢ సంక‌ల్పంతో ముందుకు సాగారు. ఫ‌లితంగా క‌నీ వినీ ఎరుగ‌ని విజ‌యం త‌న ఖాతాలోనే కాదు.. మిత్ర‌ప‌క్షాల ఖాతాల్లోనూ వేయ‌గ‌లిగారు. దీంతో ఇటు రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ ప‌వ‌న్ వ్యూహం ఫ‌లించింది. 2024 రాజ‌కీయ ముఖ చిత్రంపై చెర‌గ‌ని సంత‌కంగా మిగిలింది.

Tags:    

Similar News