ట్రంప్ – పుతిన్ ల కీలక సమావేశం... భారత్ వేదిక కాబోతుందా?
రష్యా – ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం అవిరామంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
రష్యా – ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం అవిరామంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పైగా ఇటీవల కాలంలో... ఈ రెండు దేశాల మధ్య యుద్ధంతో మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనట్లే అనే చర్చా నడిచింది. అయితే.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపు అనంతరం.. ఉక్రెయిన్ పై దాడుల విషయంలో రష్యా దూకుడు పెంచిందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.
మరోపక్క... అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం అనంతరం రష్యా – ఉక్రెయిన్ వార్ విషయంలో ట్రంప్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని.. ఆ యుద్ధాన్ని ఆపడంలో తన వంతు పాత్ర పోషించబోతున్నారు. ఈ మేరకు ట్రంప్ నుంచి ప్రకటన కూడా వచ్చిన పరిస్థితి. ఈ సమయంలో.. జనవరి 20న ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్ – పుతిన్ ల భేటీ పై ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది.
అవును... రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపై విపరీతంగా పడుతుందని అంటున్నారు. ఇందులో భాగంగా... గోధుమలకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఉక్రెయిన్ నుంచి.. గోధుమ ఉత్పత్తి తగ్గిపోయింది. ఫలితంగా పలు దేశాల్లో ఆహార సంక్షోభం తలెత్తింది. ఇక.. రష్యాపై ఆంక్షలవల్ల పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగిపోయి.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయి!
ఈ రెండు దేశాల మధ్య పరిస్థితి ఇలానే ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్యలు మరింత పెరిగిపోయే అవకాశం పుష్కలంగా ఉందని అంటున్నారు. ఈ నెపథ్యంలో... తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉక్రెయి - రష్యా దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలుకుతానని ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్.
దీంతో.. జనవరి 20 తర్వాత ట్రంప్ తో జరిగే సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి అనుకూలమైన దేశాల జాబితాను సిద్ధం చేస్తుందంట రష్యా. ఇందులో భాగంగా... ఇరు దేశాలకు తటస్థమైన వేదికగా భారత్ అయితే సానుకూలంగా ఉంటుందని రష్యాకు సన్నిహితంగా ఉన్న చాలా మంది అభిప్రాయపడ్డారని అంటున్నారు.
దీనికీ బలమైన కారణం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా... రష్యా – ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారత్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని.. ఇది అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకోవడమే అని అంటున్నారు. పైగా ఈ ఏడాదిలో రష్యా అధ్యక్షుడు భారత్ లో పర్యటించాల్సి ఉండగా.. ట్రంప్ కూడా భారత్ లో పర్యటించే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో త్వరలో వీరి కీలక సమావేశానికి భారత్ వేదిక అయ్యే అవకాశాలకు సంబంధించి రష్యా అధికార వర్గాల నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వైట్ హౌస్ కూడా ఈ విషయంలో సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని అంటున్నారు.
యూరప్ ఎందుకు వద్దు?:
వాస్తవానికి అమెరికా - రష్యాల అధ్యక్షుల మధ్య సమావేశాలు యూరప్ లోనే ఎక్కువగా జరుగుతుంటాయి. ఇందులో భాగంగానే... 2021లో యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ లో స్విట్జర్లాండ్ లోని జెనీవాలో కలుసుకున్నారు. అయితే.. ట్రంప్ మాత్రం ప్రస్తుతం కొన్ని యూరప్ దేశాలను సందర్శించకుండా ఉండొచ్చని.. భారత్ వేదికగా సానుకూలత వ్యక్తం చేయొచ్చని చెబుతున్నారు.