అగ్నిపథ్ పై షాట్ గన్ క్వశ్చన్లు విన్నారా?

Update: 2022-06-21 04:24 GMT
అప్రతిహతంగా సాగుతున్న మోడీ సర్కారుకు తొలి ఎదురుదెబ్బ మూడు వ్యవసాయ చట్టాలు అయితే.. రెండో అతి పెద్ద ఎదురుదెబ్బ అగ్నిపథ్. సైనిక దళాలకు ఎంపికైన వారి సర్వీసును కేవలం నాలుగేళ్లకే పరిమితం చేయటంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు మాత్రమే కాదు.. ఈసారి అంతకు మించి అన్న చందంగా పెద్ద ఎత్తున దాడులు.. హింసాత్మక చర్యలు చోటు చేసుకోవటం తెలిసిందే. ఇప్పటికే ఈ అంశం మీద మోడీ సర్కారు సమర్థించుకుంటుంటే.. అందుకు భిన్నంగా విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి.

తాజాగా అగ్నిపథ్ మీద ప్రశ్నాస్త్రాల్ని సంధించారు 'షాట్ గన్' శత్రుఘ్న సిన్హా. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీలో భాగస్వామిగా ఉన్న ఆయన ఎంపీగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అగ్నిపథ్ పథకంలోని వివిధ అంశాల్ని వేలెత్తి చూపుతున్న ఆయన.. ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ పథకం లోపభూయిష్ఠంగా ఉందన్న ఆయన.. దీన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న నిరసనలపై ఆయన మాట్లాడారు. అగ్నిపథ్ ను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు.

అగ్నిపథ్ పథకంలోని పలు అంశాల్ని ప్రస్తావిస్తూ ఆయన ప్రశ్నల మీద ప్రశ్నల్ని సంధించారు. ఆయన సంధించిన ప్రశ్నాస్త్రాల్ని చూస్తే..

-  అగ్ని వీరుల్ని నాలుగేళ్ల తర్వాత తొలగించి బీజేపీ కార్యాలయాల ముందు సెక్యూరిటీ గార్డ్స్ లా నియమించుకుంటారా?

-  అగ్ని పథ్ ను వ్యతిరేకిస్తూ ఆర్మీలోని మాజీ సైనికాధికారులు మాట్లాడటం నేను చూశా. సైన్యంలో పని చేసే జవాన్ల పదవీ విరమణ వయసు 58 ఏళ్లు ఉండాలని దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావటం గతంలో చెప్పేవారు. ఆయన మాటలకు భిన్నమై నిర్ణయం తీసుకోవటం ఏమిటి?

-  అగ్ని వీరులు మన దేశంలో నివసించే వారే కదా? వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది.. వారినే కాదు వారి కుటుంబాలను కూడా. మరి.. నాలుగేళ్లకు కుదించారు? ఐదేళ్లు ఎందుకు కాదు?

-  సాయిధ దళాల సిబ్బంది.. అధికారుల స్థాయి ఖంటే తక్కువగా ఉన్న వారి పదవీ విరమణ వయసు 37-38 ఏళ్ల నుంచి 58 ఏళ్లకు పొడిగించాలని బిపిన్ రావత్ చెప్పిన విషయాన్ని ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తోంది?

- నాలుగేళ్ల తర్వాత 25 శాతం మంది మాత్రమే శాశ్విత నియామకాల్లో తీసుకుంటామంటున్నారు. ఇంతకీ ఆ 25 శాతం మంది ఎవరు? వారు మీ సొంత మనుషులా? మీరు ఇష్టపడే బంధువులా?

-  నాలుగేళ్ల సర్వీసే ఎందుకు? ఐదేళ్లు ఎందుకు కాదు? కొంత గ్రాట్యుటీని ఆదా చేయటం కోసమే ఇలా చేస్తున్నారా?
Tags:    

Similar News