ఎప్పుడూ లేనిది బాలయ్య ప్రెస్ మీట్ లో ‘‘ఆమె’’

Update: 2021-11-21 01:30 GMT
సినీ నటుడిగా.. రాజకీయ నాయకుడిగా నందమూరి బాలక్రిష్ణను ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బహిరంగ సభల్లో.. ప్రెస్ మీట్లలో బాలయ్య ఏ రీతిలో మాట్లాడతారో అందరికి తెలిసిందే. ఆయన సినిమాలకు.. సేవా కార్యక్రమాలకు.. రాజకీయాలకు వేర్వేరుగా ప్రెస్ మీట్లు పెడుతుంటారు. అయితే.. ఇందుకు వేర్వేరు వేదికలు ఉంటాయి. అయితే.. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రం ఆయన జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ప్రెస్ మీట్ పెడుతుంటారు. తాజాగా అలానే ప్రెస్ మీట్ పెట్టారు.

ఏపీ అసెంబ్లీలో శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాలు.. ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు కన్నీరు పెట్టటం.. అంతకు ముందు అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి.. తన సోదరి అయిన భువనేశ్వరి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాబు సతీమణి మీద వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీకి చెందిన వారు సైతం ఇది పద్దతి కాదంటున్న పరిస్థితి.

బాబు చేసిన ఆరోపణలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ.. బాబు కుటుంబ సభ్యుల మీద వ్యాఖ్యలు చేశారనే వేళలో తాను సభలో లేనని.. ఆ సందర్భంగా ఉన్న రికార్డుల్లో నమోదైన అంశాల్ని చూసినప్పుడు.. అభ్యంతరకర వ్యాఖ్యలు ఏమీ చేసినట్లుగా తనకు అనిపించలేదన్నఆయన మాటల్ని చూసినప్పుడు రోటీన్ కు కాస్తంత భిన్నంగా ఉందని చెప్పాలి.

అంతేకాదు.. చంద్రబాబు వ్యాఖ్యలకు అనుగుణంగా స్పందించిన వైసీపీ నేతలు కామెంట్లు చేశారన్న సీఎం జగన్.. ఎప్పటిలా ఘాటుగా రియాక్టు కాకపోవటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. మీడియా సమావేశంలో బాబు బరస్ట్ అయిన వెంటనే వైసీపీ సోషల్ మీడియా విభాగం రంగంలోకి దిగటం.. పార్టీ నేతలు పలువురి చేత ఘాటు కౌంటర్లు ఇప్పించి.. అప్పటికప్పుడు క్లిప్పులు సిద్ధం చేసి వాట్సాప్ గ్రూపుల్లోనూ.. సోషల్ మీడియాలో వైరల్ చేయటం కనిపించింది. సాధారణంగా బాధితుల తరఫున జరిగే హడావుడి.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ పక్షాన రావటం ఈసారి ప్రత్యేకంగా చెప్పాలి.

ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంపై బాలయ్య ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అనూహ్యంగా బీజేపీలో ఉన్న భువనేశ్వరి సోదరి పురంధేశ్వరి.. హరిక్రిష్ణ కుమార్తె నందమూరి సుహాసిని లాంటి వారంతా స్పందించినా.. బాలయ్య మాత్రం పెదవి విప్పకపోవటం ఆశ్చర్యానికి గురి చేసింది. అందరూ స్పందించి.. తన సోదరి మీద ఫైర్ బ్రాండ్ బాలయ్య ఎందుకు మాట్లాడటం లేదన్న ప్రశ్నలకు సమాధానంగా శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు. ఈసారి ప్రెస్ మీట్ ప్రత్యేకత ఏమంటే.. బాలయ్య వెంట ఆయన సతీమణి వసుంధర ఉండటం. అటు రాజకీయాలు కానీ.. ఇటు సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లలో చాలా తక్కువగా కనిపించే వసుంధర.. తాజా ప్రెస్ మీట్ లో బాలయ్య పక్కనే ఉండి పాల్గొనటం గమనార్హం.
Tags:    

Similar News