గాయ‌మైతేనేం.. క‌సి మాత్రం గుండెల నిండా ఉంది!

Update: 2019-06-12 11:56 GMT
ఓపెన‌ర్ అయితేనేం.. క్రీజ్ లోకి వ‌చ్చింది మొద‌లు.. దొరికిన బంతిని దొరికిన‌ట్లుగా బాదేసే గ‌బ్బ‌ర్ అలియాస్ శిఖ‌ర్ ధావ‌న్ ఎంత‌లా చెల‌రేగిపోతాడో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. చిచ్చ‌ర పిడుగులా చెల‌రేగిపోతూ.. హాఫ్ సెంచ‌రీలు.. సెంచ‌రీల‌తో స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టిస్తుంటాడు. పార్మాట్ ఏదైనా.. త‌న తీరు మాత్రం ఒక్క‌టే అన్న‌ట్లుగా అత‌ని తీరు ఉంటుంది.

బ‌లంగా త‌గిలిన బంతితో వేలు ఫ్యాక్చ‌ర్ అయితే.. ఆ నొప్పితే శ‌త‌కం కొట్టాడంటే ధావ‌న్ ను ఏమ‌నాలి?  ఆట మీద అత‌గాడికున్న ప్రేమ‌.. పిచ్చి.. ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌ను చిత‌క్కొట్టాల‌న్న క‌సి ఎంత‌న్న‌ది చెప్పేస్తుంది. అన్ని ఉన్నా అదృష్టం మ‌న వైపు లేక‌పోతే ఎలా ఉంటుందో శిఖ‌ర్ కు ఇప్పుడు అర్థ‌మై ఉంటుంది.

అయితే.. త‌న‌కు జ‌రిగిన దానికి ఏ మాత్రం బాధ ప‌డ‌టం లేద‌న్న విష‌యాన్ని త‌న ట్వీట్ తో చెప్పేశాడు. ఆట మీద‌.. త‌న మీద త‌న‌కున్న ఆత్మ‌విశ్వాసాన్ని చెప్పేస్తూ అత‌గాడు పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది.  బంతి కార‌ణంగా వేలిలోప‌ల చీలిక వ‌చ్చిన విష‌యం స్కానింగ్ లో తేల‌టంతో అత‌న్ని క‌నీసం మూడు వారాల పాటు రెస్ట్ అవ‌స‌ర‌మ‌ని వైద్యులు చెప్పిన సంగ‌తి తెలిసిందే.

దీంతో.. రాబోయే రోజుల్లో అత‌గాడు ఆడాల్సిన న్యూజిలాండ్.. పాకిస్తాన్.. అఫ్గాన్ మ్యాచుల్లో ఆడే అవ‌కాశం రాని ప‌రిస్థితి. ఇలాంటివేళ‌లో ధావ‌న్ చేసిన ట్వీట్ ఇప్పుడు అభిమానుల్లో నూత‌నోత్తేజాన్ని పెంచ‌ట‌మే కాదు.. త‌న తాజా మాన‌సిక ప‌రిస్థితిని చెప్పేశాడు. రెక్క‌ల‌తో ఎగ‌ర‌టం లేదు.. మా గుండె లోతుల్లోని న‌మ్మ‌కం.. ఆత్మ‌విశ్వాసంతో ఎగురుతున్నామంటూ డాక్ట‌ర్ ర‌హ‌త్ ఇందోరీ రాసిన ప‌ద్యాన్ని పోస్ట్ చేశాడు.

తాజా ట్వీట్ చూస్తే.. గాయం త‌గ్గి.. వైద్యులు ఓకే చెబితే చాలు.. క్రీజ్ లోకి ప‌రుగుల వ‌ర‌ద పారిస్తాన‌న్న‌ట్లుగా శిఖ‌ర్ ట్వీట్ ఉంద‌ని చెప్పాలి. చిన్న చిన్న గాయాలు త‌న ఆత్మ‌విశ్వాసాన్ని త‌గ్గించ‌లేవ‌న్న విష‌యాన్ని శిఖ‌ర్ చెప్పాడు. మొత్తానికి గాయంతో తాను మ‌రింత దృఢంగా మారిన విష‌యాన్ని చెప్పేశాడ‌ని చెప్పాలి.
Tags:    

Similar News