గల్లా ఫుడ్స్ కు షాక్: భూమి స్వాధీనం చేసుకోవాలని హైకోర్టులో పిటీషన్

Update: 2021-09-04 07:36 GMT
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి షాక్ తగిలింది.. వారికి కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకోవాలని ఓ వ్యక్తి హైకోర్టుకెక్కాడు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తేనాపల్లి, పేట అగ్రహారం గ్రామాల పరిధిలో పరిశోధనాభివృద్ధి కేంద్రం (ఆర్అండ్ డీ) ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి 2011లో 28 ఎకరాల భూమి తీసుకున్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన గల్లా ఫుడ్స్ ఇప్పటివరకు ఎలాంటి పనులు మొదలు పెట్టకపోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది.

ఒప్పందం మేరకు ఆర్అండ్.డీ కేంద్రం ఏర్పాటు చేయనందున ఆ ఒప్పందాన్ని రద్దు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పూతలపట్టు మండలం నల్లగట్ల పల్లికి చెందిన గాలి పురుషోత్తం నాయుడు ఈ వ్యాఖ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు విచారణ జరిపారు.

ఇక గల్లా భూముల వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ఏపీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి , ఏపీఐఐసీ చైర్మన్ అండ్ ఎండీ, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, గల్లా ఫుడ్స్ లిమిటెడ్ లకు నోటీసులిచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేశారు. అంతకుముందు పిటీషనర్ తరుఫున న్యాయవాది పి.హేమచంద్ర వాదనలు వినిపిస్తూ ఆర్అండ్ డీ కేంద్రం ఏర్పాటు ఒప్పందంతో భూమి తీసుకున్న గల్లా ఫుడ్స్ ఆ భూమిలో ఎలాంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదన్నారు.

ఒప్పందం ప్రకారం రెండేళ్లలో ఏర్పాటు చేయాల్సి ఉందని.. ఆ భూమిని ఉపయోగించనప్పుడు తిరిగి స్వాధీనం చేయాల్సిన బాధ్యత గల్లా ఫుడ్స్ పై ఉందన్నారు. అయితే ఇప్పటివరకు భూమి స్వాధీనానికి అటు గల్లా ఫుడ్స్, ఇటు ఏపీఐఐసీ అధికారులు ఎలాంటి చర్య తీసుకోలేదని హేమచంద్ర వివరించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని గల్లా ఫుడ్స్, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది.
Tags:    

Similar News