అమెరికాలో ఘోరం : కుప్పకూలిన 12 అంతస్థుల భవనం.. 159 మంది గల్లంతు !

Update: 2021-06-26 14:30 GMT
అగ్రరాజ్యం అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. మయామీ నగరంలో ఓ 12 అంతస్తుల భవనం కుప్పకూలి దాదాపు 160 మంది ఆచూకీ   గల్లంతు అయ్యింది. ఈ  ఘటన ఫ్లోరిడాలోని ఉత్తర మియామీ సమీపంలోని జరిగింది. ఈ సంఘటనలో నలుగురు చనిపోగా, 159మంది ఆచూకీ ఇంకా లభ్యం కావటం లేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ సిబ్బంది హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఈ చాంప్లైన్ టవర్స్ సౌత్ బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

గత కొన్నేళ్ల క్రితం నిర్మించిన భవనంలో కొన్ని రోజుల కిందట పగుళ్లు గుర్తించినట్లు స్థానిక ఇంజినీర్లు చెబుతున్నారు. వాటికి మరమ్మతులు చేయాల్సి ఉండగా, ఈలోగా ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ఫ్లోరిడా అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే , ఈ భవనంలోని మరోవైపున ఉన్న ఫ్లాట్ల నుంచి ప్రజలను తరలిస్తున్నారు. దీని చుట్టు పక్కల ఉన్న భవనాల నుంచి కూడా ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటివరకు శిథిలాల నుంచి ఇద్దరిని వెలికితీసినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. వారి ఆరోగ్య పరిస్థితిపై మాత్రం వివరాలు తెలుపలేదు. అమెరికా అధ్యక్షుడు ఈ ఘటనతో ఫ్లోరిడాలో అత్యవసర పరిస్థితి ప్రకటించడంతో ఫెడరల్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ రాష్ట్ర సంస్థలకు సహకారం అందిస్తుంది. అయితే, భవనం కూలడానికి గల కారణాలు తెలియరాలేదు.
Tags:    

Similar News