గ‌ల్లా జ‌య‌దేవ్ కు ఝ‌ల‌క్.. ఖాళీ భూములు వెన‌క్కు తీసుకోనున్న ప్ర‌భుత్వం!

Update: 2020-03-07 05:22 GMT
తెలుగుదేశం పార్టీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కుటుంబానికి చెందిన అమ‌రరాజా బ్యాట‌రీస్ కంపెనీకి కేటాయించి భూముల్లో ఖాళీగా ఉన్న వాటిని వెన‌క్కు తీసుకోవడానికి ఏపీ ప్ర‌భుత్వం రెడీ అయిన‌ట్టుగా తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో అమ‌రరాజా బ్యాట‌రీస్ విస్త‌ర‌ణ‌కు గానూ గ‌తంలో కేటాయించిన భూముల్లో ఖాళీగా ఉన్న వాటిని ఇప్పుడు ప్ర‌భుత్వం వెన‌క్కు తీసుకోవ‌డానికి స‌మాయ‌త్తం అయిన‌ట్టుగా స‌మాచారం. ఇప్ప‌టికే అందుకు సంబంధించి ఏపీఐఐసీ నివేదిక‌ను రెడీ చేసింద‌ని, మార్చి రెండో తేదీనే దాన్ని ప్ర‌భుత్వానికి పంపింద‌ని.. నెక్ట్స్ కేబినెట్ భేటీలో దానిపై ఆమోద ముద్ర‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

ఇంత‌కీ ఆ కంపెనీ నుంచి ప్ర‌భుత్వం వెన‌క్కు తీసుకోనున్న భూమి ఎంతంటే.. దాదాపు 244 ఎక‌రాలు అని స‌మాచారం. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి స‌ర్కారు అమ‌ర‌రాజా బ్యాట‌రీస్ సంస్థ‌కు 488 ఎక‌రాల‌ను కేటాయించిన‌ట్టుగా తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం ప్రాంతంలో ఏపీఐఐసీ ద్వారా ఆ భూముల‌ను గుర్తించి, ప్ర‌భుత్వం మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో ఆ భూమిని ఆ సంస్థ కొనుగోలు చేసిన‌ట్టుగా తెలుస్తోంది. అప్ప‌ట్లో గ‌ల్లా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉండేద‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు.

వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి కేబినెట్లో గ‌ల్లా అరుణ మంత్రిగా కూడా చేశారు. ఆ భూముల్లో అమ‌ర‌రాజా బ్యాట‌రీస్ ను విస్త‌రించాల‌నేది ప్ర‌ణాళిక‌. ఆ మేర‌కు ఆ సంస్థ విస్త‌రించిన‌ట్టుగా తెలుస్తోంది. కానీ పూర్తి భూమిని వినియోగించుకోలేద‌ట‌. మొత్తం 488 ఎక‌రాల్లో 244 ఎక‌రాల భూమిని ఆ సంస్థ ఉప‌యోగించుకుంద‌ట‌. మిగ‌తా భూమిని మాత్రం త‌న ప‌రిధిలోనే ఉంచుకుని ఖాళీగా పెట్టుకున్న‌ట్టుగా తెలుస్తోంది.

ఇప్ప‌టికే కేటాయింపులు జ‌రిగి ద‌శాబ్దం గ‌డిచిపోయిన‌ట్టే. ఇప్పటికీ ఆ సంస్థ ఆ భూమిని ఖాళీగానే ఉంచ‌డంతో.. వెన‌క్కు తీసుకోవ‌డానికి రంగం సిద్దమైన‌ట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ముందుగా ఏపీఐఐసీ అక్క‌డ భూముల‌ను ప‌రిశీలించింద‌ని, భూమిని ఖాళీగా ఉంచ‌డాన్ని ధ్రువీక‌రించిన‌ట్టుగా స‌మాచారం. ఈ నేప‌థ్యంలో దాన్ని వెన‌క్కు తీసుకోవ‌చ్చ‌ని ప్ర‌భుత్వానికి తెలియ‌జేసింద‌ట‌. ఆ నిర్ణ‌యానికి ప్ర‌భుత్వం ఆమోద‌ముద్ర వేయ‌నుంద‌ని తెలుస్తోంది.

ఇక ఈ విష‌యం లో స‌హజంగానే తెలుగుదేశం పార్టీ అనుకూలురులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అమ‌రావ‌తి నే రాజ‌ధానిగా కొన‌సాగించాల‌నే ఉద్య‌మంలో గ‌ల్లా జ‌య‌దేవ్ క్రియాశీల‌కంగా పాల్గొంటున్నందునే ఆ భూముల‌ను ప్ర‌భుత్వం వెన‌క్కు తీసుకుంటోంద‌ని టీడీపీ వ‌ర్గాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. అయితే ప్ర‌భుత్వం కేటాయించిన భూముల్లో ఎక్కువ కాలం పాటు పెట్టుబ‌డిదారుల యాక్టివిటీస్ లేక‌పోతే.. వాటిని వెన‌క్కు తీసుకోవ‌డం కొత్త ఏమీ కాదు.
Tags:    

Similar News