చిన్న గుండె లయ తప్పడానికి కారణం ఏంటి?

Update: 2022-03-02 03:30 GMT
ఒకప్పుడు గుండె పోటు అంటే వయసు పైబడిన వారికి మాత్రమే వచ్చేది. ఓ యాభై ఏళ్లు దాటితే హార్ట్ ఎటాక్ ప్రమాదం ఉండేది. కానీ ఇటీవల కాలంలో అందుకు భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. చిన్న వయసులోనే ఎంతో మంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నతనంలోనే గుండె ఎందుకు లయ తప్పుతోంది? ఆకస్మికంగా గుండె పోటు రావడానికి గల కారణాలేంటి?.

చిన్నతనంలో గుండె పోటు రావడానికి చాలా కారణాలు ఉన్నాయని ప్రముఖ కార్డియాలజిస్టు వైద్యులు చెబుతున్నారు. ఊబకాయం, రక్తంలో కొవ్వు పేరుకుపోవడం, వ్యాయామం చేయకపోవడం, పొగతాగడం, మధుమేహం, అధిక రక్తపోటు, మద్యపానం వంటి వాటివల్ల ఆకస్మికంగా గుండె పోటు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె రక్త నాళాలు మూసుకు పోవడం, రక్తనాళాలు చిట్లిపోవడం, గుండెకు రక్తం సరఫరా ఆగిపోవడం వంటి కారణాల వల్ల సడెన్ గా హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. చనిపోయేంత ముప్పు కూడా ఉంటుందని పేర్కొన్నారు.

గుండె కొట్టుకోవడానికి శరీరంలోని ప్రత్యేక విద్యుత్ వ్యవస్థ సహకరిస్తుందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. గుండె వేగం, కొట్టుకోవడాన్ని అది నియంత్రిస్తుందని అన్నారు. అయితే ఇందులో ఏమన్నా ఆటంకం ఏర్పబడితే గుండె కొట్టు కోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు. ఫలితంగా గుండె లయ వేగంగా లేదా నెమ్మదిగా జరగవచ్చు. ఇలా గుండె పోటు వచ్చేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఇందులో వెంట్రిక్యులర్ టెకీకార్డియా, వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ అనే రెండు పద్ధతులు ఉంటాయని పేర్కొన్నారు. ఫిబ్రిలేషన్ అనగా గుండె కొట్టుకోవడం ఆకస్మికంగా ఆగిపోతుంది. అంటే కరెంట్ షార్ట్ సర్క్యూట్ మాదిరిగా గుండె లయ తప్పుతుంది. టెకీకార్డియా గుండె పని తీరును దెబ్బతీస్తుంది. క్రమంగా ఇది ఫిబ్రిలేషన్ కు దారి తీస్తుంది. ఇలా గుండె పోటు వస్తుంది. అయితే ఇదంతా బయటకు ఆకస్మికంగా వచ్చినట్లే అనిపిస్తుందని వైద్యులు అంటున్నారు. వీటిని ముందస్తుగా గుర్తించలేమని చెబుతున్నారు.

కరోనా వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం, రక్త సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి పోస్ట్ కోవిడ్ లో గుండెపోటు అధికమవుతోంది. అయితే గుండెపోటుకు కోవిడ్ మాత్రమే కారణమని చెప్పలేమని స్పష్టం చేశారు. మితిమీరిన వ్యాయామం వల్ల కూడా ఎక్కువ ఒత్తిడి పెరిగి... గుండెపోటు వస్తుందని అంటున్నారు. హార్ట్ ఎటాక్ ను ముందుగా గుర్తించడం కష్టమని... దానికి ఎటువంటి సూచికలు ఉండవు అని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించుకుంటే మంచిదని చెబుతున్నారు.

అకస్మాత్తుగా గుండె కొట్టుకోవడం ఆగిపోతే... వెంటనే స్పందించాలి. డిఫ్రిబిలేటర్ తో గుండె మళ్లీ కొట్టుకునేలా చేయాలి. ఇలా చేయడం వల్ల గుండెకు విద్యుత్ షాక్ తగిలి.. మళ్లీ కొట్టుకోవడం ప్రారంభమవుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. గుండె లయ తప్పే వారికి ఫేస్ మేకర్ ఉంటే మేలు అని అంటున్నారు. దీనివల్ల గుండె సమస్యలు కాస్త తగ్గుతాయని చెబుతున్నారు. కాబట్టి సున్నితమైన గుండె పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
Tags:    

Similar News