అమెరికాలో ఆగని గన్ కల్చర్: హ్యూస్టన్ లో కాల్పులు.. నలుగురు మృతి

Update: 2022-08-29 03:57 GMT
అభివృద్ధిలో అగ్రరాజ్యం..పెత్తనంలో పెద్దన్న..అలాంటి అమెరికాలోని ప్రజలు ఇప్పుడు నిత్యం భయపడుతూ బతుకుతున్నారు. అందుకు కారణం గన్ కల్చర్ పెరగడమే. మొన్నటికి మొన్న ఓ పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు విచక్షణ రహితంగా అమాయకులైన విద్యార్థులపై కాల్పులు జరిపి 19 మంది ప్రాణాలను బలిగొన్నాడు. ఇటీవల మరో మరో గుర్తు తెలియని వ్యక్తి ప్రజలపై కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించారు. 11 మందికి పైగా గాయపడ్డారు.

వరుసగా జరుగుతున్న ఇలాంటి కాల్పులతో అమెరికాలోని ప్రజలు భిక్కభిక్కుమంటూ గడుపుతున్నారు. అసలు అమెరికాలో ఇలాంటి కాల్పులు జరగకుండా చట్టం చేసినా కూడా కాల్పులు ఆగకపోవడం గమనార్హం.విచ్చలవిడిగా గన్స్ అందుబాటులో ఉంచడమే ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమవుతోంది.

అమెరికాలో మరోసారి తాజాగా కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్ లోని హూస్టన్ లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.  పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు.

హుస్టన్ సిటీలోని ఓ ఇంటికి నిందితుడు ముందుగా నిప్పంటించాడు. దీంతో అందులో ఉన్న వారు బయటకు రాగా వారిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు.

అమెరికాలోని గన్ కల్చర్ ఈనాటిది కాదు.. 1775 నుంచి వీటి వాడకం మొదలైంది. అప్పట్లో ఆఫ్రికన్ అమెరికన్లను బానిసలుగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో తుపాకులు వాడడం మొదలుపెట్టారు. 1776లో ఇంగ్లాండ్ తో పోరాటం చేసి స్వాతంత్ర్యం సంపాదించుకున్న అమెరికా ఆ తరువాత అమెరికన్లు తమ భద్రత కోసం గన్స్ తో తిరిగేవారు. అయితే అప్పటి నుంచి ఈ కల్చర్ కొనసాగుతోంది. అంతేకాకుండా 'వ్యక్తిగత భద్రత' అనే పేరు చెప్పి ప్రతి ఒక్కరూ గన్స్ ను కొనుగోలు చేస్తున్నారు.

కొందరు భద్రత కోసం తుపాకులు కొనుగోలు చేస్తుండగా.. మరికొందరు ప్రెస్టెజీ కోసం వాడుతున్నారు. ఇలా  ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక గన్ ఉంటుంది. ఏదైనా గొడవ జరిగినా.. సైకోలుగా మారినా ప్రతీకారంతో బయటకు వచ్చి ఇలా ఇష్టానుసారంగా కాల్పులు జరుపుతూ ప్రాణాలు తీస్తున్నారు. దీంతో అమెరికాలో సగటు పౌరుల భద్రత ఎండమావిగా మారుతోంది.
Tags:    

Similar News