తమిళులు భగ్గుమనేలా బెంగళూరులో ఏం జరిగింది?

Update: 2016-09-12 10:45 GMT
రెండు రాష్ట్రాల మధ్య ఏదైనా వివాదం నడుస్తున్న వేళ.. ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఏ ఒక్కరూ సంయమనం కోల్పోయినా పరిస్థితులు అదుపు తప్పటం ఖాయం. తాజాగా అలాంటి ఘటనేఒకటి బెంగళూరులో చోటు చేసుకుంది. దీనికి ప్రతిగా తమిళనాడులో పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. కావేరీ ఇష్యూ మీద కన్నడ నటులు ఆందోళనకు దిగారు. దీన్ని తప్పు పడుతూ బెంగళూరులో చదువుకుంటున్న ఒక తమిళ విద్యార్థి (సంతోష్) ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. ఇతడి గురించి ఆరా తీసి.. అతడు చదువుతున్న ప్రైవేటు కళాశాలలోనే అతడిపై దాడి చేశారు కొందరు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావటం తెలిసిందే.

తొలుత సోషల్ మీడియాలో సంచలనంగా మారిన ఈ అంశం తర్వాత.. న్యూస్ ఛానళ్లు ఈ వీడియో క్లిప్ ను ప్రసారం చేయటంతో తమిళులు భగ్గుమంటున్నారు. ఐదుగురు యువకులు చుట్టుముట్టి దారుణంగా కొట్టిన వైనం తమిళనాడులోని తమిళుల్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. దీనికి ప్రతిగా అన్నట్లు సోమవారం ఉదయం నుంచి పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

ఇప్పటివరకూ రెండు రాష్ట్రాల మధ్య  ధర్నాలు.. నిరసన ప్రదర్శనలు.. ఆందోళనలు మాత్రమే చోటు చేసుకోగా.. ఇప్పుడు కన్నడ వ్యతిరేక కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. సోమవారం ఉదయం చెన్నై మహానగరంలో కర్ణాటకకు చెందిన హోటల్ మీద పెట్రోల్ బాంబులు విసిరి కలకలం రేపటంతో పాటు.. హోటల్లోకి దూసుకెళ్లిన పలువురు వారిపై దాడికి దిగారు. ఈ సందర్భంగా హోటల్ ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఇదే తీరులో మరికొన్ని చోట్లా కర్ణాటక వాసుల ఆస్తులపై దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది.

ఇక.. కర్ణాటకకు చెందిన వాహనాలపై తమిళులు తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో కర్ణాటకకు చెందిన వాహనాలు కనిపిస్తే చెలరేగిపోతున్నారు. వాటిపై దాడులకు దిగుతున్నారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి చేజారినట్లుగా కనిపిస్తోంది. కావేరీ అంశంపై ప్రధాని మోడీ కల్పించుకోవాలంటూ కర్ణాటక నేతలు డిమాండ్ చేస్తుంటే.. హింస సమస్యకు పరిష్కారం కాదంటూ తమిళ నేతలు గళం విప్పారు. విద్యార్థిపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని.. తమిళులకు భద్రత పెంచాలంటూ కేంద్రమంత్రి రాధాకృష్ణన్.. ఎండీఎంకేచీఫ్ వైగో తదితరులు కర్ణాటకను కోరారు.
Tags:    

Similar News