రెెండు అంత్యక్రియలు.. ఒక అంతర్మధనం

Update: 2015-04-09 11:30 GMT
రెండు.. మూడు రోజులతో తేడాతో జరిగిన రెండు ఘటనలకు సంబంధించి ఒక అంశం మాత్రం ఒకే రోజు పూర్తి అయ్యింది. సిమీ ఉగ్రవాదుల చేతుల్లో కాల్పులకు గురై.. కామినేని ఆసుపత్రిలోచికిత్స పొందుతూ.. వీర మరణం పొందిన ఎస్‌ఐ సిద్ధయ్య అంత్యక్రియలు బుధవారం సాయంత్రం జరిగాయి.

అదే సమయంలో.. వరంగల్‌ జైలు నుంచి హైదరాబాద్‌ కోర్టుకు తీసుకొస్తున్న ఐఎస్‌ఐ ఉగ్రవాదులు వికారుద్దీన్‌ అండ్‌ కో పారిపోయేందుకు ప్రయత్నించటం.. దీంతో పోలీసులు కాల్పులు జరపటంతో వారు చనిపోవటం తెలిసిందే. వారికి మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించి బుధవారం వారి కుటుంబ సభ్యులకు ఉగ్రవాదుల మృతదేహాల్ని అప్పజెప్పారు.

ఒకరితో ఒకరికి ఏమాత్రం సంబంధం లేకున్నా.. ఒకరు చట్టానికి లోబడి విధులు నిర్వహిస్తే.. మరొకరు చట్టాన్ని సవాలు చేస్తూ వ్యవహరించిన వ్యక్తి. ఒకరు.. సమాజానికి.. అందులోని ప్రజలకు రక్షగా నిలిచేందుకు ప్రయత్నిస్తే.. మరోవ్యక్తి తాను ఉండే సమాజంలో కల్లోలం సృష్టించి.. శాంతిభద్రతలకు ప్రశ్నార్థంగా మారి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించే వ్యక్తి.

ఎస్‌ఐ సిద్ధయ్య మృతికి బాధపడిపోయి.. తమ ఇంట్లో వ్యక్తి మరణించినట్లుగా ఫీలై.. దు:ఖ సాగరంలో మునిగిపోయిన వారు లక్షలాది మంది ఉన్నారు. అదే సమయంలో.. తమ చర్యలతో ఇప్పటికే పలువురు పోలీసుల్ని పొట్టనబట్టుకున్న ఉగ్రవాది వికారుద్దీన్‌ మరణానికి బాధపడుతూ.. అతని అంతిమయాత్రలో వందలాది మంది పాల్గన్నారు.

వేర్వేరుగా జరిగిన ఈ రెండు ఘటనల్ని చూసినప్పుడు చుట్టూ ఉన్న సమాజాన్ని చూసినప్పుడు ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో భావాలు ముసురుకోవటం ఖాయం. ప్రజల్ని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలు అర్పించిన వ్యక్తి కోసం తపించిపోవటం.. అయ్యో అనటంలో అర్థం ఉంది. కానీ.. సమాజానికి సవాలుగా.. తన చర్యల ద్వారా శాంతిభద్రతలకు సవాలుగా మారే వ్యక్తి మరణానికి వందలాది మంది బాధ పడటం ఏమిటి? పోలీసుల్ని తిట్టిపోయటం ఏమిటి? పోలీసుల వాహనాలకు నిప్పు పెట్టటం ఏమిటి?

ఈ లెక్కన పోలీసుల్ని చంపిన వారికి సహకారం అందించటమో.. లేదంటే.. వారి పట్ల సానుభూతిగా వ్యవహరించే వారి పట్లకూడా పోలీసులు ఇదే తీరుతో వ్యవహరిస్తే? ఉగ్రవాది అంతిమయాత్ర తర్వాత పోలీసుల వాహనాల్ని పెట్రోల్‌ పోసి తగలబెట్టేసే వారిపై చర్యలు ఉంటాయో ఉండవో చెప్పలేం. అసలు అలాంటి చర్యలకు తెగించేంత దైర్యం వారికి ఎక్కడి నుంచి వస్తుంది?

ఉగ్రవాది ఎన్‌కౌంటర్‌ అయితే.. అతని కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బలాల ఓదార్చటమే కాదు.. అంతిమయాత్రలో పాల్గనటం ఏమిటి? ఒక్క బలాల మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహ్మద్‌ అలీ మాట్లాడుతూ.. ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌.. ''హోమ్‌ కో భీ దుఖ్‌ హై'' అని వ్యాఖ్యానించటం ఏమిటి? ఉగ్రవాదులకు ఇంతలా మద్ధతు ప్రకటించటం ఏమిటి?

ఉగ్రవాదులపై చట్టప్రకారం విచారణ జరిగి ఉంటే బాగుండేదని చెప్పటం బాగుంది. కానీ.. ఆ క్రమంలో అతడు పారిపోవటానికి ప్రయత్నించినా చూస్తూ ఊరుకోవాలా? వారు పారిపోతూ చంపేస్తే.. ఉద్యోగం చేస్తున్న పాపానికి చచ్చిపోవాలా? పోలీసుల పనితీరును తప్పుపడుతున్న వారు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. నిజంగా వికారుద్దీన్‌ను ఎన్‌కౌంటర్‌ చేసి చంపేయటమే లక్ష్యమైతే.. ఇంతకాలం బతికి ఉంచాల్సిన అవసరం ఏమిటి? ఎప్పుడో ఎన్‌కౌంటర్‌ చేసేవాళ్లు కదా? కానీ.. అలాంటిదేమీ లేకుండా ఇప్పుడే చేయాల్సిన అవసరం ఏమిటి?

చట్టప్రకారం విచారణ జరిగితే బాగుంటుందని చెబుతున్న వారు.. వికారుద్దీన్‌ తిట్టే తిట్లను ఉద్యోగం చేస్తున్న పాపానికి పోలీసులు ఎందుకు భరించాలి? అంతదాకా ఎందుకు.. వికారుద్దీన్‌ అంతిమయాత్ర సందర్భంగా పోలీసుల్ని బాహాటంగా తిట్టేసిన అతని మద్ధతుదారులు చట్టాన్ని ఉల్లంఘించటంలో వారి బరితెగింపు ఏమిటి? వారెందుకిలా వ్యవహరిస్తున్నారు.

మరోపక్క విధి నిర్వహణలో మరణించిన ఎస్‌ఐ సిద్ధయ్య కుటుంబానికి జరిగిన అన్యాయం మాటేమిటి? ఒక్క సిద్ధయ్య మాత్రమే కాదు.. అంతకు ముందు మరణించి ఇద్దరు పోలీసులు.. వికారుద్దీన్‌చేతిలో హతమైన పోలీసుల కుటుంబాల పరిస్థితి ఏమిటి? వారేం తప్పు చేశారని వికారుద్దీన్‌ వారిని కాల్చి చంపాడు. కాల్చి చంపిన ఉగ్రవాదికి ఇంత భారీగా సపోర్ట్‌ ఉంటే.. విధి నిర్వహణలో ఉన్న సిద్ధయ్య లాంటి వారి విషయంలో నేతలు కారుస్తున్న కన్నీటికి విలువ ఉంటుందా? సిద్ధయ్య మరణానికి కారణమైన శక్తుల పట్ల పలువురు నాయకులు ఇప్పటివరకూ ఖండించింది లేదు. ఎందుకలా? వారి దృష్టిలో పోలీసుల కంటే.. ఉగ్రవాదులే సమాజానికి అవసరమని భావిస్తున్నారా? అదే నిజమైతే.. తమకు రక్షణగా పోలీసుల్ని కాపాలా ఉంచుకోవటం ఎందుకు..?
Tags:    

Similar News