గడియారం గుట్టు విప్పిన ముఖ్యమంత్రి

Update: 2016-02-26 04:47 GMT
స్నేహితుడు ఇచ్చిన వాచ్ ను వెనుకాముందు చూసుకోకుండా పెట్టేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భారీ మూల్యమే చెల్లించారని చెప్పక తప్పదు. ఫ్రెండ్ ఇచ్చిన గడియారాన్ని చేతికి పెట్టేసుకున్న ఆయన.. సదరు వాచ్ కారణంగా తాను అన్ని సమస్యల్లో ఇరుక్కుపోతానని కలలో కూడా ఊహించి ఉండదరు. తాను పెట్టుకున్న వాచ్ విలువ రూ.70లక్షలన్న విషయాన్ని విపక్ష నేత కుమారస్వామి తెరపైకి తెచ్చే వరకూ దాని విలువ తెలియదన్నది ముఖ్యమంత్రి వాదన.

తెలిసి చేసినా.. తెలియకుండా చేసినా తప్పు తప్పే కావటం.. రూ.70లక్షల వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చిన స్నేహితుడి గుట్టు విప్పాలంటూ విపక్షాలు విరుచుకుపడటం తెలిసిందే. ఈ వ్యవహారంలో నుంచి బయటపడేందుకు సిద్ధరామయ్య కిందామీదా పడుతున్నారు. గత కొద్దిరోజులుగా సాగుతున్న ఈ ఇష్యూకు సంబంధించి వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చేసిన వ్యక్తి వివరాల్ని ఆయన తాజాగా వెల్లడించారు.

దుబాయ్ లో ఉండే తన చిరకాల స్నేహితుడు డాక్టర్ గోపాల్ పిళ్లై గిరిష్ చంద్రవర్మ గత ఏడాది బెంగళూరుకు వచ్చారని.. ఆ సందర్భంగా తనను కలిసినప్పుడు ఈ వాచ్ ను బహుమతిగా ఇచ్చారని చెప్పుకొచ్చారు. అయితే.. ఆ వాచ్ అంత విలువైనదన్న విషయం తనకు తెలియదని.. ఇప్పుడు తెలిసిన నేపథ్యంలో ప్రభుత్వానికి గిఫ్ట్ ట్యాక్స్ చెల్లిస్తున్నట్లుగా వెల్లడించారు.

విధాన సౌధలోని మంత్రివర్గ సమావేశం హాలులో ఈ విలువైన వాచ్ (రూ.70 లక్షలుగా అంచనా) ను ఉంచుతున్నట్లు కర్ణాటక సీఎం చెబుతున్నారు. ఇన్ని మాటలు చెప్పిన సిద్ధరామయ్య.. ఈ వాచ్ వ్యవహారంలో తనపై ఆరోపణలు చేసిన జేడీఎస్ అధినేత కుమారస్వామిపై చట్టపరమైన చర్యలు ఎలా తీసుకోవాలన్నది న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడిన్ని మాటలు చెబుతున్న సిద్ధరామయ్య.. రూ.70లక్షల వాచ్ గురించి కుమారస్వామి ఆరోపణలు చేసిన వెంటనే.. దాన్ని బహుమతిగా ఇచ్చిన స్నేహితుడి గురించి అప్పటికప్పుడే ఎందుకు చెప్పనట్లు? అన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు. సిద్ధరామయ్య వైఖరి చూస్తుంటే.. తనను ఎంతగానో ఇబ్బంది పెట్టిన కుమారస్వామిని ఎంతోకొంత ఇబ్బంది పెట్టేందుకే చర్యల గురించి ప్రస్తావిస్తున్నట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News