సీఎం సెటైర్: మోడీ దిగుమ‌తి నేత‌

Update: 2018-04-26 04:16 GMT
క‌ర్ణాట‌క రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి. నామినేష‌న్ల దాఖ‌లు ముగిసిన నేప‌థ్యంలో నాయ‌కులు ఇక ప్ర‌చారంపై దృష్టి సారించారు. అయితే సంప్ర‌దాయ ప్ర‌చార మాధ్య‌మాల‌తో పాటుగా సోష‌ల్ మీడియాలో సైతం త‌మ దూకుడును ప్ర‌ద‌ర్శిస్తున్నారు. బీజేపీపై ఏక‌ధాటిగా ట్వీట్లు చేస్తూ ఆ పార్టీని టార్గెట్ చేస్తున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాజాగా ఎన్నికల హీట్‌ పెంచారు. ఇవాళ ఆయన చేసిన తాజా ట్వీట్‌ వివాదాస్పదంగా మారింది. ప్రధాని మోడీ - యూపీ సీఎం యోగిని ఆయన ఉత్తరాది దిగుమతి నేతలు పేర్కొన్నారు. దీంతో స‌హ‌జంగానే బీజేపీ విరుచుకుప‌డింది.

ప్ర‌ధాని మోడీ - యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌చారంపై సిద్ధ‌రామ‌య్య స్పందిస్తూ `రాష్ట్రంలో వారికి నేతలు లేనట్లు కర్ణాటక బీజేపీ నేతలు ఉత్తరాది నేతలు మోడీ - యోగిల కోసం వెయిట్‌ చేస్తున్నారు.` అని ఎద్దేవా చేశారు. `స్థానిక బీజేపీ నేత యడ్యూరప్పను డమ్మీగా చేసేశారు. ప్రధాని వస్తారు… పోతారు. ఇక్కడ పోటీ సిద్ధరామయ్యకు - యడ్యూరప్పకు. ఎవరు గెలవబోతున్నారో మీకు తెలుసు` అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. అయితే దీనికి కర్ణాటక బీజేపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. ‘దిగుమతా? సీఎం గారూ… మీరు ఇంకా ఎంతగా దిగిజారిపోతారు’ అంటూ బీజేపీ ట్వీట్‌ చేసింది. దక్షణాది - ఉత్తరాది అనే విభజన తేవడాన్ని తీవ్రంగా ఖండించింది. మీ సొంత నియోజవర్గాలే మిమ్మల్ని తిరస్కరించాయి. ప్రధానికి జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ప్రధాని ఇక్కడి వస్తే నాయకత్వం గురించి ఒకట్రెండు విషయాలు మీరు నేర్చుకోవచ్చని బీజేపీ ఎద్దేవా చేసింది.

కాగా, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు గ‌ట్టి పోటీ ఇచ్చే ఎత్తుగ‌డ‌నే బీజేపీ అవ‌లంభించిన సంగ‌తి తెలిసిందే. బాగలకోట జిల్లా బాదామి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసేందుకు సిద్ధ‌రామ‌య్య‌ నామినేషన్‌ దాఖలు చేశారు.బాదామిలో తమ అభ్యర్థి ఎవరో చివరి క్షణం వరకు సస్పెన్స్‌ లో ఉంచిన బీజేపీ… చివరి క్షణంలో మైనింగ్ కింగ్ గాలి జ‌నార్ద‌న్ రెడ్డి స‌న్నిహితుడు అయిన‌ బి. శ్రీరాములు పేరు వెల్లడించింది. దీంతో ఈ పోటీ చాలా ఆసక్తికరంగా మారింది. అయితే నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 27 వరకు గడువు ఉంది. వచ్చే నెల 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా.. 15న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. చాముండేశ్వరి నుంచి పోటీ చేస్తున్న సిద్ధరాయమ్య బాదామి నుంచి కూడా పోటీ చేస్తున్నారు.
Tags:    

Similar News