మోడీ క‌ల‌ల‌కు దిమ్మ‌తిరిగే షాక్ తగిలింది

Update: 2017-04-01 08:21 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ క‌ల‌ల ప్రాజెక్టుకు గ‌ట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజ‌కీయ సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా లోక్‌ సభతో పాటు దేశంలోని అన్ని శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు త‌న ఆస‌క్తిని గ‌తంలో మోడీ వ్య‌క్త‌ప‌రిచ‌న సంగ‌తి తెలిసిందే. ఈ క‌ల‌ను సాకారం చేసుకునేందుకు గాను చట్టాన్ని సవరించేందుకు ప్రైవేట్ మెంబర్ బిల్లు ద్వారా మోడీ నాయ‌కత్వంలో ఎన్‌ డీఏ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే ఈ స్కెచ్‌ ను ప్రతిపక్షం విఫలం చేసింది. ఒకే రోజులో రెండు సార్లు ఎన్డీఏ ఎత్తుగ‌డ‌కు దెబ్బ‌కొట్టింది.

లోక్‌ సభ-శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఎన్నికలకు, ఇతర సంబంధిత చట్టాలను సవరించేందుకు కేంద్రాన్ని కోరుతూ బీజేపీ సీనియర్ నాయకుడు భూపేందర్ యాదవ్ రాజ్యసభలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించాలనుకున్నారు. భూపేందర్ సింగ్ ఇచ్చిన ఈ తీర్మానం రాజ్యసభ ఎజెండాలో కూడా చేర్చారు. లోక్‌ సభ - రాజ్యసభలో శుక్రవారం మధ్యాహ్నం నుండి ప్రైవేట్ మెంబర్ బిల్లులు - తీర్మానాలపై చర్చ జరుపుతారు. ఉభయ సభల్లో కూడా సభ్యులు తమ ప్రైవేట్ మెంబర్ బిల్లులు - తీర్మానాలపై చర్చ జరగగానే వెళ్లిపోతుంటారు. ఇతర సభ్యుల ప్రైవేట్ మెంబర్ బిల్లులు, తీర్మానాల చర్చపై వారికి ఎలాంటి ఆసక్తి ఉండదు. రాజ్యసభలో ఈరోజు కూడా ఇదే జరుగుతుందని ఆశించిన అధికార పక్షం తమ పార్టీకి చెందిన భూపేందర్ యాదవ్ ప్రతిపాదించిన తీర్మానాన్ని ఆఖరున ప్రతిపక్షం సభ్యులందరూ వెళ్లిపోయిన తరువాత చర్చకు చేపట్టి తమ పని చేసుకోవాలనుకున్నారు. ఇక్క‌డే ట్విస్ట్ ఎదురైంది.

త‌మ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల్లో భాగంగా లోక్‌ సభ - శాసన సభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలంటూ భూపేందర్ యాదవ్ ప్రతిపాదించిన తీర్మానాన్ని ఆఖరున చేపట్టేందుకు అధికార పక్షం వేసిన ఎత్తుగడను గ్రహించిన రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ చాకచక్యంతో దెబ్బ తీశారు. రాజ్యసభ ఉపాధ్యక్షుడు పీజే కురియన్ మొదట చేపట్టిన తీర్మానాలపై చర్చ త్వరగా పూర్తి కాకుండా చూడటంతో పాటు కాంగ్రెస్ సభ్యులు అధిక సంఖ్యలో సభలో ఉండేలా చేయటం ద్వారా గులాం నబీ ఆజాద్ అధికార పక్షాన్ని దెబ్బ తీశారు. బుందేల్‌ ఖండ్ కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలంటూ బీజేపీ సభ్యుడు విశ్వంభరప్రసాద్ ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ తీర్మానంపై చర్చ జరిగిన అనంతరం ఇతర తీర్మానాలపై చర్చకు అంగీకరించకుండా సభ్యుల ప్రత్యేక ప్రస్తావనలపై చర్చ జరపాలని ప్రతిపక్షం పట్టుపట్టింది. దీనితో రాజ్యసభ అధ్యక్ష పదవిలో ఉన్న జేటియా అధికార, ప్రతిపక్షం సభ్యులు ఇచ్చిన ప్రత్యేక ప్రస్తావనలపై చర్చ చేపట్టారు.ప్రత్యేక ప్రస్తావనలపై చర్చ పూర్తి కాగానే భూపేందర్ యాదవ్ ప్రతిపాదించిన తీర్మానంపై చర్చ జరపాలని ప్రభుత్వం భావించింది. అయితే గులాం నబీ ఆజాద్, ఇతర ప్రతిపక్షం నాయకులు వేసిన ఎత్తుగడ దీనిని సాధ్యం కానివ్వలేదు.

ఇదిలా ఉంటే సభలో అధికార పక్షం సభ్యులు కేవలం పది మంది ఉంటే ప్రతిపక్షానికి చెందిన దాదాపు ముప్పై మంది సభలో ఉండటంతో అధికార పక్షం భూపేందర్ యాదవ్ ప్రతిపాదించిన తీర్మానంపై చర్చకు డిమాండ్ చేయలేకపోయింది. ఇదిలా ఉంటే సాయంత్రం ఐదు గంటల తరువాత సభను కొనసాగించేందుకు ప్రతిపక్షం ససేమిరా అంగీకరించలేదు. దీనితో సభను నిర్వహిస్తున్న జేటియా రాజ్యసభను ఏప్రిల్ ఏడో తేదీ వరకు వాయిదా వేయక తప్పలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News