రాజధాని.. వెంకపాటెం టు రాయపూడి!

Update: 2015-05-26 17:30 GMT
నవ్యాంధ్ర రాజధాని నగరం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకపాలెం నుంచి రాయపూడి వరకూ ఉండనుంది. వాస్తవానికి, సగం రాజధానిని కృష్ణా నదిలో నిర్మించనున్నట్లు సింగపూర్‌ ప్రభుత్వం ప్రణాళికలో చూపించింది. కానీ, అది కృష్ణా నది ఒడ్డు నుంచి దాదాపు మంగళగిరి వరకు రాజధాని నగరం విస్తరించనుంది. కృష్ణా నది ఒడ్డున వాటర్‌ స్పోర్ట్స్‌ వస్తాయి. దానికి కొద్ది దూరంలో క్రికెట్‌ స్టేడియం వస్తుంది.

వాస్తవానికి సింగపూర్‌ ప్రభుత్వం రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ అద్భుతంగా ఉందని కానీ గొప్పగా ఉందని కానీ చెప్పడానికి అవకాశం లేదు. ఇందులో ఎక్కడెక్కడ రోడ్లు ఉంటాయి. అవి ఎలా ఉంటాయి? ఎక్కడెక్కడ  కారిడార్లు.. రైల్వే లైన్లు, మెట్రో లైన్లు తదితరాలు వస్తాయి. నెట్‌వర్కులు.. సర్క్యూట్లు తదితరాలను మాత్రమే ప్రధానంగా పేర్కొన్నారు. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌లో పేర్కొన్న ముఖ్యమైన అంశం.. జల మార్గాలు. వాస్తవానికి కృష్ణా నదిలోనే జల మార్గాలు ఉంటాయని అనుకుంటాం. కానీ, రాజధాని మధ్యలో కూడా జల మార్గాలను మాస్టర్‌ ప్లాన్‌లో చూపించారు. అంటే ప్రత్యేకంగా కాల్వలు వంటి వాటిని తవ్వి వాటిలో పడవలు నడిపేలా ప్లాన్‌ చేస్తున్నారు.

రాజధాని నగరంలో పెద్ద రోడ్డు వెడల్పు 200 అడుగులు ఉంటే చిన్న రోడ్డు వెడల్పు 80 అడుగులు ఉంటుందంటే రోడ్లు ఎంత విశాలంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. దీనినిబట్టే, రాజధాని నిర్మాణం ఎలా ఉండబోతోందో కూడా ఊహించుకోవచ్చు. కృష్ణా నదిలో ఒక చోట నుంచి మరొక చోటకు వెళ్లడానికి వాటర్‌ టాక్సీని అందుబాటులోకి తెస్తారు. రాజధాని చుట్టుపక్కల ఉండే ఆలయాలన్నిటినీ కలిపేలా ఒక సర్క్యూట్‌ పెట్టారు. వాస్తవానికి ఇది కొత్తదేమీ కాదు. కానీ సింగపూర్‌ బృందం దీనిని కూడా ప్రత్యేకంగా తీసుకుంది.

ఇక రాజధానికి సంబంధించిన సీడ్‌ కేపిటల్‌ కూడా వెంకటపాలె నుంచి రాయపూడి మధ్యలోనే రానుంది. ఇక్కడ కృష్ణా నది నుంచి ఐదు కిలోమీటర్ల దూరం వదిలేసి.. సీడ్‌ కేపిటల్‌ను నిర్మిస్తారు. ఇక్కడి నుంచి పాతిక కిలోమీటర్లు అంటే దాదాపు మంగళగిరి వరకు సీడ్‌ కేపిటల్‌ వస్తుంది.
Tags:    

Similar News