బాబుకు అపాయింట్‌ మెంట్ కూడా ఇవ్వలేదు

Update: 2016-10-09 22:30 GMT
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరాన్ని స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో కట్టబోయేది సింగపూర్ ప్రభుత్వమే.. అని చంద్రబాబునాయుడు ఇప్పటికి చాలాకాలంగా జనాన్ని ఊదరగొడుతున్నారు. అమరావతి నిర్మాణం గురించి సింగపూర్ ప్రభుత్వమూ అక్కడి ప్రధాని కూడా చాలా ఉత్సాహంగా ఉన్నట్లుగా కూడా గతంలో చెప్పకున్నారు. సింగపూర్ పర్యటనలకు వెళ్లి, ప్రధానిని కలిసి వచ్చిన తర్వాత.. ఒప్పందాలు అయిపోయాయ్.. ఇక వారు బీభత్సమైన వేగంతో మన రాజధానిని కట్టిచ్చేస్తారని చంద్రబాబు హామీలు గుప్పించారు.

కానీ వాస్తవంలో అంతా అబద్ధాలే అని తేలిపోయింది. చంద్రబాబు సింగపూర్‌ కు వెళుతున్నారు. వస్తున్నారు తప్ప.. అక్కడి ప్రభుత్వం మన రాజధానిని నిర్మించడం గురించి ఏమాత్రం సీరియస్‌ గా పట్టించుకోవడం లేదని.. తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది.

తాజాగా సింగపూర్ ప్రధాని అయిదు రోజుల భారత పర్యటనకు వచ్చి వెళ్లారు. ఆయన పర్యటన షెడ్యూలు ఖరారు కావడానికి ముందు ఆయన అమరావతి కి కూడా వస్తున్నారని - ఇక్కడ నిర్మాణాలు జరగబోయే ప్రదేశాన్ని పరిశీలిస్తారని చంద్రబాబు ప్రకటించారు. కానీ.. తనకు పెద్దగా అధికారిక కార్యక్రమాల ఒత్తిడి లేకపోయినప్పటికీ కూడా సింగపూర్ ప్రధాని ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూడలేదు. స్విస్ ఛాలెంజ్ విధానం అనేది రచ్చకెక్కి.. ప్రభుత్వం పరువు పోయేలా కోర్టులో వివాదం నడుస్తున్నందున.. ఆ వివాదం తేలేవరకు తాము సైలెంట్ గా ఉంటే బెటరనే ఉద్దేశంతో ప్రధాని రాలేదని సమాచారం. అయితే సింగపూర్ ప్రధాని ఇండియా వచ్చి వెళ్లిపోతే.. తన పరువు పోతుందని భయపడ్డ చంద్రబాబు.. తాను వెళ్లి ఢిల్లీలో ఆయనను కలవడానికి అయినా చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. చంద్రబాబుకు సింగపూర్ ప్రధాని కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. దీని ప్రకారం చూస్తే.. అసలు స్విస్ ఛాలెంజ్ గొడవ కోర్టుల్లో కొలిక్కి రావడం ఒక పెద్ద సమస్య అయితే.. సింగపూర్ వాళ్లు మనల్ని ఇంకా పట్టించుకుంటున్నారా లేదా అనేది మరో సందేహంగా మారుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News