నేడు సింగ‌పూర్‌.. నాడు వెరీ పూర్‌..!

Update: 2021-05-28 02:30 GMT
సింగ‌పూర్ అన‌గానే ఆకాశ‌హార్మ్యాలు మ‌దిలో మెదులుతాయి. అద్భుత‌మైన అభివృద్ధి క‌ళ్ల ముందు క‌ద‌లాడుతుంది. కానీ.. ఈ దేశం కూడా ఒక‌నాడు పూరిగుడిసెల్లో కునారిల్లిందే. మురికి వాడ‌ల్లో దుర్వాస‌న‌లు పీల్చిందే. అంత‌క‌న్నా ముఖ్యంగా.. ప‌రాయి పీడ‌న‌లో ఈ దేశం కూడా న‌లిగిపోయిందే. ఈ దేశానికి స్వాతంత్రం వ‌చ్చి కేవ‌లం 55 సంవ‌త్స‌రాలే. ఈ కొద్ది కాలంలోనే అనిత‌ర‌సాధ్య‌మైన ప్ర‌గ‌తిని న‌మోదు చేసింది.

ఎన్నో క‌ష్టాల‌ను చ‌విచూసిన ఆ దేశ ప్ర‌జ‌లు త‌మ‌ను తామే అభివృద్ధి చేసుకున్నారు. ఇందుకోసం ఎంతో ప‌టిష్టంగా ప్ర‌ణాళిక‌లు ర‌చించుకొని, వాటిని ప‌క్కాగా అమ‌లు చేసుకున్నారు. ఫ‌లితంగా అర్ధ‌శ‌తాబ్దంలోనే త‌మ అదృష్ట రేఖ‌ను మ‌లుపు తిప్పుకున్నారు. త‌మ‌ త‌ల‌రాత‌ను తామే తిప్పి రాసుకున్నారు.

ఇప్పుడు.. ప్ర‌పంచ ప‌ర్యాట‌కుల‌కు ఎంత‌గానో న‌చ్చిన దేశాల్లో సింగ‌పూర్ అగ్ర‌స్థానంలో ఉంటుంద‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. ప్ర‌జ‌ల‌కు ఉపాధి క‌ల్పించ‌డంలో, ర‌వాణా, ఆరోగ్యం వంటి సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంలో ప్ర‌పంచ దేశాల‌తో పోలిస్తే ఎంతో ముందున్న‌ది సింగ‌పూర్‌. అవినీతికి అక్క‌డ అవ‌కాశ‌మే లేక‌పోవ‌డం ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. అధికారుల‌తోపాటు రాజ‌కీయ నేత‌లు కూడా అద్భుత‌మైన పాల‌న‌తో భాగ‌మై దేశాన్ని అత్యున్న‌త శిఖ‌రాన నిలిపారు.

జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ అధ్య‌య‌నం ప్ర‌కారం.. ప‌లు దేశాల‌కు చెందిన ధ‌న‌వంతులు షాపింగ్ చేయ‌డానికి సింగ‌పూర్ వెళ్లి వ‌స్తార‌ట‌. ఇక‌, క‌రోనా నిరోధానికి ఆ దేశం తీసుకున్న చ‌ర్య‌లు చూసి ప్ర‌పంచం ముక్కున వేలేసుకుంది. త‌మ దేశాల్లో కొవిడ్ భ‌యం తాళ‌లేక‌పోతున్న‌వారంతా సింగ‌పూర్ వెళ్లి నెల‌ల త‌ర‌బ‌డి ఉండి వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే.. సింగ‌పూర్ ను చూస్తే స‌రిపోతుంద‌ని అంటారు విశ్లేష‌కులు.
Tags:    

Similar News