లాక్ డౌన్ : 2 లక్షల మద్యం బాటిల్స్ చోరీ .. సిట్ వేసిన ప్రభుత్వం !

Update: 2020-05-08 01:30 GMT
హర్యానాలో లాక్ డౌన్ వేళ భారీగా మందు బాటిళ్లు మాయం కావడం సంచలనంగా మారింది. ఏకంగా 2లక్షల మద్యం బాటిళ్లు మాయమైయ్యాయి. హర్యానా రాష్ట్రంలోని సోనిపట్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీని కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాఫ్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలేది లేదని హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ చెప్పారు. దీని వెనుక ఉన్న వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు.

లాక్ డౌన్ లో మద్యం షాపులు మూసివేయడంతో ఓ గోడౌన్ లో మద్యం బాటిళ్లు స్టాక్ ఉంచారు. లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి మే 5వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలో ఎక్కడా మద్యం విక్రయాలు జరగలేదు. లాక్ డౌన్ 3వ దశలో కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వడంతో హర్యానా రాష్ట్రంలో మే 6వ తేదీన మద్యం షాపులు తెరుచుకున్నాయి. దీంతో గోడౌన్ లో చోరీ వ్యవహారం వెలుగుచూసింది.

దీని వెనుక లిక్కర్ మాఫియా హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఎక్సైజ్, పోలీసు సిబ్బందిని ప్రభావితం చేసి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అలాగే విధుల్లో ఉన్న సిబ్బంది ప్రమేయం లేకుండా ఇలాంటి ఘటనలు జరగవన్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. ఒకరు ఐఏఎస్. ఒకరు ఏడీజీపీ ర్యాంకు ఆఫీసర్. మరొకరు ఎక్సైజ్ శాఖ నుంచి సీనియర్ అధికారి. త్రిసభ్య కమిటీ వెంటనే రంగంలోకి దిగి విచారణ ప్రారంభించింది. కాగా, ఎక్సైజ్ శాఖను సీఎం దుశ్యంత్ చౌతాలా పర్యవేక్షిస్తున్నారు. దీనిపై మీడియా ఆయన స్పందన కోరింది. మద్యం బాటిళ్ల మాయంపై హోంమంత్రి విచారణకు ఆదేశించారని సీఎం వెల్లడించారు.
Tags:    

Similar News