ఈ 'సోలో' శాప విముక్తి ఎప్పుడు చంద్రబాబు?

Update: 2021-08-22 11:21 GMT
రాజకీయ పార్టీ అన్నప్పుడు వన్ మ్యాన్ షో అంటూ ఏమీ ఉండదు. అందరు కలిసి పని చేస్తేనే ఫలితం ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు కావొచ్చు.. జాతీయ పార్టీలు కావొచ్చు.. ఒకే వ్యక్తి శాసిస్తుంటాడు. కానీ.. సదరు వ్యక్తి చుట్టూ సమర్థులు.. నమ్మకస్తులు.. విశ్వాసపాత్రుల టీం చాలా ముఖ్యం. అదేం దరిద్రమో కానీ.. చంద్రబాబు చుట్టూ ఉండే వారంతా కూడా అవకాశం చూసుకొని వచ్చే వారే. తేడా కొడితే చాలు.. బుల్లెట్ కు అందనంత వేగంగా మాయమవుతారు. అధికారంలో ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ముసిరిన ఈగల్లా బాబు చుట్టూ చేరతారు.ఒక్కసారి చేతిలోని అధికారం మాయమైనంతనే ఒక్కడు ఉండదు. గతంలోనూ ఇదే పరిస్థితి ఇప్పుడు ఇలాంటి పరిస్థితే.

ఎందుకిలా? బాబు ఎంపిక బాగుంటుందనే వారు.. ఆయనకంటూ సొంత టీం ఎందుకు ఉండదు? ఉన్నోళ్లంతా హ్యాండ్ ఇచ్చేటోళ్లే కానీ.. విశ్వాసపాత్రంగా ఉండరెందుకు? అన్న ప్రశ్నలు తరచూ వినిపిస్తూ ఉంటాయి. 2014 ఎన్నికల్లో విజయం సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు.. కేంద్రంలో సుజనా.. సీఎం రమేశ్ లు.. రాష్ట్రంలో నారాయణ.. గంటా.. దేవినేని ఉమ.. పత్తిపాటి.. లాంటి వారంతా ఉన్నారు. ఇప్పుడు చెప్పిన పేర్లలో ఎంతమంది ఇప్పుడు ఆయన వెంట ఉన్నారు? మరెంత మంది యాక్టివ్ గా ఉన్నారో చూస్తే ఇట్టే.. బాబు ఎంపిక ఏంత బాగుంటుందో ఇట్టే అర్థమవుతుంది.

అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులపై విరుచుకుపడేందుకు నలుగురైదుగురు తప్పించి.. బలమైన నేతలు కనిపించరు. అధికారంలో ఉన్నా.. లేకున్నాప్రత్యర్థులపై పోరాడే బాధ్యత మాత్రం చంద్రబాబును వదిలిపెట్టి వెళ్లదు. అదే సమయంలో పార్టీ కోసంకమిట్ మెంట్ తో పని చేసే వారిని గుర్తించే విషయంలో చంద్రబాబుకు సమీకరణాలు సరిపోవు. దీంతో వారికి పదవులు రావు..ఆయనకు దగ్గరగా రాలేరు. వచ్చినోళ్లంతా పనులు చూసుకొని వెళ్లిపోయే వారే తప్పించి.. బాధ్యత బరువుల్ని మోసేటోళ్లు చాలా తక్కువగా ఉంటుంది.

ఇదే ఇప్పుడు చంద్రబాబుకు తలనొప్పిగా మారుతోంది. వయసు మీద పడి.. యువ కెరటమైన జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనాలంటే అనుభవం ఒక్కటే సరిపోదు. బాబు ఆలోచనల్ని నెరవేర్చే బాధ్యత తీసుకునే పరివారం చాలా ముఖ్యం. ఈ విషయంలో చంద్రబాబు ఒంటరిగా చెప్పక తప్పదు. చుట్టూ నీళ్లు ఉంటాయి.. తాగేందుకు గుక్కెడు కూడా ఉండవని తుపాను..వరద సమయాల్లో చెప్పిన రీతిలో టీడీపీలో బాబు పరిస్థితి ఇంచుమించు ఇలానే ఉంటుంది. గతంలో చుట్టూ నేతలు ఉండేవారు. ఇప్పుడు వారుకూడా తగ్గిపోతున్నారు.

సమస్యల్ని పెంచుకుంటూ పోవటం.. ఇష్యూస్ ను తుంచేయటం తప్పనిసరి. లాలించాల్సిన చోట లాలింపు మంచిదే కానీ.. కొరడా ఝుళిపించే విషయంలో బాబును పట్టి పీడించే సంకోచం ఆయన్ను ఇబ్బందికి గురి చేస్తుందని చెప్పాలి. ఇదే ఆయన్ను ఒంటరి శాపం నుంచి బయటపడకుండా చేస్తుందని చెప్పాలి. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా సరే.. విశ్వాసపాత్రులుగా ఉండే వారిని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం బాబుకు ఉంది. లేకుంటే.. రానున్న రోజుల్లో ఒక్కడిగా పార్టీ బండి నడపటం చాలా కష్టమన్న విషయాన్ని ఆయన ఎప్పటికి గుర్తిస్తారో?
Tags:    

Similar News