తగ్గిన ఓట్లు ఎవరి కొంప ముంచుతుందో ?

Update: 2022-03-06 07:30 GMT
ఉత్తరప్రదేశ్ లో ఆరు విడతల పోలింగ్ విషయమై తాజాగా బయటపడిన విషయాలు విచిత్రంగా ఉన్నాయి. 7వ తేదీన ఏడోది, ఫైనల్ విడత పోలింగ్ జరగబోతున్న విషయం తెలిసిందే. మార్చి 10వ తేదీన కౌంటింగ్ జగబోతోంది.

బెనారస్ హిందు యూనివర్సిటి మాలవీయ రీసెర్చి సెంటర్ ప్రొఫెసర్ కవితా షా జరిగిన పోలింగ్ పై అధ్యయనం చేస్తున్నారు. ఈమె నేతృత్వంలోని విద్యార్ధులు ప్రధానంగా తగ్గిన  ఓటింగ్ శాతంపైనే దృష్టిపెట్టారు. ఈ అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన అంశాలు బయటకొచ్చాయి.

కవితాషా చెప్పేదాని ప్రకారమైతే ప్రభుత్వం మీద జనాల్లో బాగా వ్యతిరేకత ఉంటే పోలింగ్ శాతం పెరుగుతుందట. ప్రభుత్వపనితీరు మీద వ్యతిరేకత ఉన్నపుడే జనాలు పోలింగ్ కేంద్రాలకు వచ్చి అధికారపార్టీకి వ్యతిరేకంగా ఓట్లేసేందుకు ఉత్సాహం చూపుతారు.

కానీ యూపీలో పోలింగ్ శాతం బాగా తగ్గిపోయింది. మొదటి నాలుగు దశల్లో జరిగిన పోలింగ్ పై కవితా బృందం అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో 231 నియోజకవర్గాలను పరిశీలిస్తే  సుమారు 139 నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం తగ్గిపోయింది.

139 నియోజకవర్గాల పోలింగ్ ను తీసుకుంటే సగటున 9 శాతం ఓటింగ్ తగ్గిపోయింది. పోలింగ్ సగటు తీసుకుంటే తక్కువగా 6 శాతం తగ్గితే అత్యధికంగా 12 శాతం పోలింగ్ తగ్గిపోయినట్లు అర్ధమవుతోంది. 139 నియోజకవర్గాల్లో కూడా 28 సీట్లలో 10 వేల ఓట్లచొప్పున తగ్గిపోయాయట. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఓటింగ్ శాతం బాగా తగ్గిపోయిన నియోజకవర్గాల్లో ఎక్కువగా 2017 ఎన్నికల్లో మెజారిటి బీజేపీయే గెలిచిందట.

మొత్తానికి ఓట్లశాతం తగ్గినా పెరిగినా సమస్యే అన్నట్లుగా ఉంది. తగ్గితే ఎవరికి నష్టం, పెరిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే చర్చలు సాధారణంగా జరుగుతుండేవి.

రెండు పద్దతుల్లోను ఒకపార్టీకి లాభమంటే మరోపార్టీకి ఆటోమేటిక్ గా నష్టమనే అనుకోవాలి. మొదటి నాలుగు విడతల్లో భారీగా తగ్గిన పోలింగ్ శాతం బయటపడింది. మరి తర్వాత జరిగిన మూడు విదతల పోలింగ్ శాతం తగ్గిందో పెరిగిందో అధ్యయనం చేయాల్సుంటుంది. వీటన్నింటి ప్రభావం చివరకు ఏడో విడతపైన పడే ప్రభావం ఉంది.
Tags:    

Similar News