ఆ డాక్టర్ నిజంగా దేవుడే

Update: 2015-10-27 09:50 GMT
ఇవాల్టి రేపటి రోజున బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తులు.. వ్యవస్థలు తమ ధర్మాన్ని పట్టించుకోని పరిస్థితి. అయితే.. అంతటా ఇలాంటి పరిస్థితి లేదని.. ఇప్పటికి కొందరు వృత్తిని దైవంగా భావిస్తూ.. అంకితభావంతో పని చేస్తున్న ఉదంతాలున్నాయి. అలాంటి కోవకు చెందిందే తాజాగా బయటకు వచ్చిందీ ఉదంతం. సోమవారం మధ్యాహ్నం హిందూకుష్ పర్వత సానువుల్లో చోటు చేసుకున్న భూప్రకంపనల ధాటికి అప్గానిస్థాన్.. పాకిస్థాన్ లతో పాటు జమ్మూ కశ్మీర్ నుంచి ఢిల్లీ వరకూ భూప్రకంపనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

అప్గానిస్థాన్.. పాక్ లతో పోలిస్తే జమ్మూ కశ్మీర్ లలో భూప్రకంపనల తీవ్రత తక్కువే. అలా అని వాటిని తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. భూప్రకంపనల ధాటికి కొన్ని గంటల పాటు జమ్మూ కశ్మీర్ లో కమ్యూనికేషన్ల వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోయిన పరిస్థితి.

ప్రకృతి ప్రకోపం ధాటికి వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ప్రాణభయంతో పరుగులు తీసిన వారు ఎందరో. అందరి సంగతి పక్కన పెట్టి.. ఆసుపత్రిలో.. అందులోకి ఆపరేషన్ థియేటర్ లో సర్జరీ చేస్తున్న సమయంలో భూకంపం వస్తే పరిస్థితి ఏమిటి? విన్నంతనే వణుకు పుట్టేలా ఉన్న ఈ విషయం నిజంగా చోటు చేసుకుంటే? సరిగ్గా ఇలాంటి పరిస్థితే కశ్మీర్ లోని స్కిమ్స్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఈ ఆసుపత్రిలో భూకంపం వచ్చే సమయానికి రెండు ఆపరేషన్లు జరుగుతున్నాయి.

భూప్రకంపనల ధాటికి నర్సులు.. మిగిలిన డాక్టర్లు భయంతో బయటకు పరుగులు పెడితే.. ఆపరేషన్ థియేటర్ లో ఉన్న వైద్యులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. భూమి ప్రకంపిస్తున్న సమయంలో ఆపరేషన్ థియేటర్ గోడల్ని పట్టుకొని.. కిందకు పడిపోకుండా జాగ్రత్త పడిన వైద్యులు.. పేషెంట్ విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకొని.. ఆపరేషన్ పూర్తి చేశారు. దేవుడు ప్రాణం పోసి పంపితే.. వైద్యుడు ఆ ప్రాణాన్ని కాపాడే అపర దేవుడన్న మాటకు తగ్గట్లే ఈ వైద్యులు వ్యవహరించారన్న మాటను పలువురు వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News