శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ పై కరోనా ఎఫెక్ట్ .. అన్ని నిబంధనలే !

Update: 2020-07-29 13:00 GMT
శ్రావణమాసం మొదలైందంటే పెళ్ళిళ్ల సందడి మొదలైనట్టే. ఈ మాసంలో ఉండే ప్రతిరోజూ కూడా మంచి రోజే కావడంతో ఈ మాసం మొత్తం శుభకార్యాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా పెళ్లిళ్లకి విశిష్టమైన మాసం ఈ శ్రావణమాసం. వేసవి ముహుర్తాలని కరోనా మింగేయడంతో చాలామంది శ్రావణమాసం పై ఆశలు పెట్టుకున్నారు. కానీ , ఇంకా కరోనా ప్రభావం తగ్గలేదు. రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఈ కరోనా విజృంభణ సమయంలో పెళ్లిళ్లు చేసుకోవాలన్నా కూడా అడుగడుగునా నియమాలు .. నింబంధనలు.

జీవితంలో ఒకే ఒకసారి జరిగే ఈ అతి పెద్ద వేడుకను బంధుమిత్రుల సమక్షంలో చాలా సందడిగా చేసుకోవాలని అందరికి ఉంటుంది. కానీ, కరోనా కాలంలో కొద్దిమందితోనే తూతుమంత్రంగా ముగించేస్తున్నారు. ఫలితంగా పదులు, వందల సంఖ్యలోనే ఈ శ్రావణంలో చాలామంది భయపడుతూనే ముహూర్తాలను పెట్టుకుంటున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఇవి పోతే అక్టోబర్ 19 నుంచి 31 మధ్యే మళ్లీ ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఇక కరోనా వైరస్ నేపథ్యంలో పెళ్లిళ్లకు ఎక్కువమందిని పిలిచే అవకాశం లేకుండాపోయింది. అతి ముఖ్యమైన వారికీ మాత్రమే ఆహ్వానాలు అందిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. దీనితో పెళ్లికి వచ్చేవారు కరోనా టెస్టు చేయించుకుని ఆ రిపోర్టును తహసీల్దార్ ‌కు ఇవాల్సిన పరిస్థితి కూడా ఉంది. తహసీల్దార్‌ ఓకే అంటేనే పెళ్లికి లేదంటే లేదు. ఇలా వచ్చే వారంతా కరోనా టెస్టు చేయించుకోవాలంటే ఎలా అని పిలిచేవారు , వచ్చేవారు ఏమి చేయాలో తెలియక ఆలోచనలో పడ్డారు. ఇంకా కొన్ని జిల్లాల్లో ఐతే పెళ్ళికి వచ్చేవారికి ఆధార్ తప్పనిసరి చేసారు. గతంలో పెళ్ళికి వెళ్ళాలి అని అనుకునేవారు ..ఎంతో హుందాగా టిప్ టాప్ గా రెడీ అయ్యి వెళ్లేవారు. కానీ, ఇప్పుడు పెళ్ళికి వెళ్లాలంటే ఎదో యుద్దానికి సిద్ధం అయినంత పని అవుతుంది.
Tags:    

Similar News