య‌డ్డీ రిజైన్‌..ఆ వేడి త‌గ్గి...ఈ వేడి మొద‌లైంది

Update: 2018-05-20 03:24 GMT
ఎన్నో ఎత్తుగడలు...అనేక మలుపులు...క్యాంపు రాజకీయాలు.. నరాలు తెగే ఉత్కంఠ తర్వాత కర్ణాటక రాజకీయాల్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ నేత యడ్యూరప్ప కథ ముగిసింది. బలపరీక్షలో నెగ్గడానికి ఏడుగురు ఎమ్మెల్యేలు తక్కువ కావడంతో బలపరీక్షకు వెళ్లకుండానే యడ్యూరప్ప వెనుదిరిగారు. అసెంబ్లీలో ఉద్వేగ పూరిత ప్రసంగం చేసిన అనంతరం సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన యడ్డీ రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించడానికినేరుగా రాజ్‌భ‌వ‌న్ వెళ్లారు. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ శిబిరాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. కుమారస్వామే తమ సీఎం అంటూ అసెంబ్లీలో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు విక్టరీ సింబల్స్ చూసిస్తూ నినాదాలు చేశారు. మొత్తం అనూహ్య మలుపుల అనంతరం కర్ణాటకలో రాజకీయ వేడి చల్లారింది.

అయితే ఈ వేడి చల్లారిందో లేదో..మ‌రో వేడి మొద‌లైంది. యెడ్డీ రాజీనామాప‌ర్వంపై సోష‌ల్ మీడియాలో సెటైర్ల మీద సెటైర్లు పేలుతున్నాయి. ఒక‌రోజు సీఎంగా సినీన‌టుడు ఉంటే..రెండ్రోజుల సీఎంగా య‌డ్యుర‌ప్ప ఉన్నార‌ని కొంద‌రు పోస్టులు పెట్టారు. రంగంలోకి దిగేముందు కాలు దువ్వితే...విశ్వాస ప‌రీక్ష సంద‌ర్భంగా వెన్నుచూపి చ‌తికిల ప‌డ్డారంటూ ఇంకొంద‌రు ట్వీట్లుచేశారు. ద‌క్షిణాదిలో అరంగేట్రం చేస్తారంటూ ప్ర‌ధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా కాలు దువ్వితే..క‌న్న‌డ పోరు త‌ర్వాత అరుంద‌తిని చూసిన వ్య‌క్తిలా పారిపోయారంటూ పంచ్‌లు వేశారు.

ఇదిలాఉండ‌గా...కర్ణాటక రాజకీయాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో దాని గురించి జోక్‌లు, కామెంట్లు విపరీతంగా వైరల్ అయిన సంగ‌తి తెలిసిందే. శుక్రవారం కర్ణాటక రాజకీయ వివాదంపై సుప్రీంకోర్టులో గంభీరమైన వాతావరణం మధ్య విచారణ జరుగుతుండగా న్యాయమూర్తి ఏకే సిక్రీ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఓ జోక్‌ను వినిపించి అక్కడున్న వారందరినీ కడుపుబ్బా నవ్వించారు. ఈ హాస్యభరిత సంఘటనను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సామాజిక మాధ్యమాల్లో ఒక సందేశం బాగా వైరల్ అవుతున్నది. తన వద్ద 117 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని ఓ రిసార్ట్ యజమాని గవర్నర్‌కు లేఖరాశారు అని జస్టిస్ సిక్రీ పేర్కొన్నారు. దీంతో కోర్టు రూంలో ఒక్కసారిగా పెద్దఎత్తున నవ్వులు విరబూశాయి.
Tags:    

Similar News