సోష‌ల్ మీడియా టాక్స్ : ఆధిప‌త్యం వ‌ద్దు ఆ పేరు ఉంటే చాలు ? అంబేద్క‌రిజం !

Update: 2022-05-19 05:27 GMT
కొన్నేళ్లుగా వెనుక‌బ‌డిన త‌నంతో అవ‌స్థ‌లు ప‌డిన వ‌ర్గాల‌ను ఆదుకోవాల్సింది పోయి కేవ‌లం పేర్ల‌తో క‌ళ్ల‌లో ఆనందాలు నింపాల‌ని చూడ‌డ‌మే విడ్డూరంగా ఉంద‌ని  కొంద‌రు ద‌ళిత‌వాదులు పేర్కొంటూ.. కోన‌సీమ జిల్లాకు (ఉమ్మ‌డి తూర్పుగోదావరి ప్రాంతం) అంబేద్క‌ర్ పేరు పెట్ట‌డంపై పెద‌వి విరుపు ధోర‌ణులు వినిపిస్తున్నాయి.

మ‌రోవైపు కోన‌సీమ జిల్లాకు అంబేద్క‌ర్ పేరు పెట్ట‌డాన్ని స్వాగ‌తిస్తూ మంత్రి చెల్లుబోయిన వేణుతో స‌హా మిగ‌తా వాళ్లంతా ఆనందాలు చిందిస్తున్నారు. ఇవ‌న్నీ బాగానే ఉన్నా రాజ‌కీయ ఆధిప‌త్యం అన్న‌ది సాధించ‌కుండా కేవ‌లం అంబేద్క‌ర్ పేరు పెట్టినంత‌నే సంతోషాలు సంబంధిత సందోహాలు ఎందుకు అని ప్ర‌శ్నిస్తున్నారు కొంద‌రు సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు.

ఎందుకంటే ఎప్ప‌టి నుంచో తాము అణ‌గారిన వ‌ర్గాలుగా ఉండిపోతున్నామ‌ని, కేవ‌లం ప‌ద‌వుల వ‌ర‌కే కొంద‌రు ప‌రిమితం అయి ఉండ‌డం వ‌ల్ల‌నే ద‌ళిత జ‌నోద్ధార‌ణ అన్న‌ది సాధ్యం కావ‌డం లేద‌ని అంటూ ఆవేద‌న చెందుతున్నారు.

వైసీపీ స‌ర్కారుకు కానీ లేదా మ‌రో స‌ర్కారుకు కానీ చిత్త‌శుద్ధి ఉంటే  ద‌ళిత వాడ‌ల అభివృద్ధికి కృషి చేయాల‌ని కోరుతున్నారు. అటు తెలంగాణ‌లోనూ ఇటువంటి వాద‌నే వినిపిస్తోంది.

కేవ‌లం పేరు పెట్టినంత మాత్రానే ప‌ద‌వులు ద‌క్కినంత మాత్రానే అంతా మ‌న మంచికే అనుకోవ‌డం ఉత్త భ్ర‌మ అని, ఇప్ప‌టికే ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ నిధులు ప‌క్క‌దోవ ప‌డుతున్నాయ‌ని, వాటి విష‌య‌మై మాట్లాడ‌కుండా ఏం మాట్లాడినా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని ఓ వాద‌న వినిపిస్తోంది. ముఖ్యంగా ఇరు తెలుగు రాష్ట్రాల‌లో ద‌ళితుల క‌న్నా వారి పేరిట ద‌ళారీలే ఎక్కువ‌గా చెలామణీ అవుతున్నార‌న్న ఆవేద‌న ద‌ళిత సంఘాల‌లో ఉంది.

ఇవి కేవ‌లం (పేర్లు పెట్ట‌డం, పథ‌కాలు ప్ర‌వేశ‌పెట్ట‌డం) కంటి తుడుపు చ‌ర్య‌లుగానే మిగిలిపోవ‌డం ఖాయం అన్న భావ‌న వ్య‌క్తం అవుతోంది. ఇప్ప‌టికే ద‌ళిత బంధు పేరిట అతి పెద్ద త‌ప్పిదం కేసీఆర్ చేస్తున్నార‌ని, గ‌తంలో ఎక్కువ మంది చేరే ల‌బ్ధి ఇప్పుడు ఏ కొద్ది మందికో అదీ వాళ్ల అనుకూల వ‌ర్గాల‌కే చెందుతోంద‌ని, ఇదే విధంగా ఇక్క‌డ అంటే ఏపీలో కూడా ద‌ళిత సంక్షేమం అన్న‌ది కేవ‌లం పేప‌ర్ల‌కే పరిమితం కావడం విచార‌క‌రం అని అంటున్నారు వీళ్లంతా !
Tags:    

Similar News