నన్ను కొందరు కావాలనే ట్రోలింగ్ చేస్తున్నారు..: తమిళ సై సంచలన వ్యాఖ్యలు

Update: 2022-04-19 05:33 GMT
తెలంగాణలో ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య జరుగుతున్న పోరు రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. ఒక గవర్నర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదని, ఇది కచ్చితంగా వివక్షేనని గవర్నర్ తమిళ సై సుందరరాజన్ ఆరోపించారు. అయితే ప్రభుత్వ నేతలు మాత్రం గవర్నర్ హోదాలో ఉండి రాజకీయాలు చేస్తున్నారని, అందుకే ఆ పదవికి గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. అయితే ఇటీవల ఢిల్లీ వెళ్లిన తెలంగాణ గవర్నర్ రాష్ట్ర పరిస్థితులపై నివేదిక అందించారు. ఇక్కడ జరుగుతన్న పరిస్థితులపై ఆమె  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వివరించారు. అయితే ఇటీవల తెలంగాణ గవర్నర్ ను మార్చేస్తారని వార్తలు వస్తున్నాయి.  ఈ సందర్భంగా ఆమె ఢిల్లీలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తి విషయాలు పంచుకున్నారు.

దేశానికి సేవ సేయడంలో ఎంత మేరకు కట్టుబడి ఉన్నారో పరిశీలించాకే గవర్నర్ పదవి ఇస్తారని అన్నారు. నామీద ఢిల్లీ పెద్దలకు విశ్వాసం ఉంది కాబట్టే తెలంగాణ గవర్నర్ గా, పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ గా  హోదా ఇచ్చారని అన్నారు. కేంద్రంలోని నాయకుల పట్ల నాకు విశ్వాసం ఉంది. వారు ఎప్పటికీ మంచే చేస్తారని అన్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి నైతికంగా మద్దతు ఉంది కాబట్టే నేను ఇలా ఉన్నానని అన్నారు.

గవర్నర్ పదవిని తేలికగా తీసుకోవద్దని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ పోస్టుకు ఎందుకు విలువ ఇవ్వడం లేదో అర్థం కావడం లేదన్నారు. గవర్నర్ గా  వారం రోజుల పాటు సెలవులు తీసుకోవచ్చని, కానీ నేను సెలవులు పెట్టకుండా పనిచేశానని అన్నారు. గవర్నర్ పదవిలో ఉండి ఎలా పనిచేయాలో నేర్చుకున్నానని అన్నారు. కానీ కొందరు మహిళనని చూడకుండా విలువ ఇవ్వడం లేదని అన్నారు.

ప్రొటోకాల్ విషయంలో ప్రభుత్వ నేతలే కాకుండా అధికారులు కూడా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని అన్నారు. భద్రాచలం వెళ్లిన సమయంలో ఎస్పీ రాలేదని అన్నారు. గవర్నర్ కు భద్రత కల్పించాల్సిన ఎస్పీ అక్కడికి రాలేనప్పుడు ఎలా రక్షిస్తారని ప్రశ్నించారు. ఇక తమిళ నూతన సంవత్సరం సందర్భంగా పుదుచ్చేరిలో ప్రతిపక్షాలు హాజరు కాపోవడం అక్కడి రాజకీయ పరిస్థితుల ప్రభావమన్నారు. కానీ తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీనాయకులు రాకపోవడంలో అర్థం లేదన్నారు. అహంకారంతో, నిరంకుశంగా వ్యవహరించే మనస్తత్వం తనది కాదని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన వినతిని సంబంధిత శాఖకు పంపించానని అన్నారు.

కొంతమంది సోషల్ మీడియాలో నన్ను ట్రోలింగ్ చేస్తున్నారు. ఏ ఎన్నికల్లో గెలవలేదు కాబట్టే గవర్నర్ పదవి ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో గెలవకపోయినా ప్రజల మద్దతు ఉంది. వారి అండతోనే నేనీస్థితికి రాగలిగా. వ్యక్తిగతంగా నాకు ఎవరిపై శత్రుత్వం లేదు.

ఇక రాష్ట్ర ప్రభుత్వంతో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం లేకున్నా నాపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు, ప్రభుత్వాలు మంచి చేసినప్పుడు సమస్యలు గవర్నర్ వరకు ఎందుకు వస్తాయని అన్నారు. ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలతో పోరాటం చేయాలి గానీ గవర్నర్ తో కాదని అన్నారు. ఇక నన్ను తప్పిస్తారని కొందరు బెదిరిస్తున్నారని, అలాంటి బెదిరింపులను నేను భయపడనని గవర్నర్ తమిళ సై అన్నారు.
Tags:    

Similar News