రూ.2వేలుకు రూ.500 తోడు వచ్చేసిందోచ్..

Update: 2016-11-13 14:09 GMT
పెద్దనోట్ల రద్దు ఓపక్క.. చిల్లర నోట్ల కష్టాలు మరోపక్కతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సగటు జీవికి ఊరటనిచ్చే ప్రయత్నం ఒకటి జరిగింది. మంగళవారం రాత్రి వేళ దేశంలో చలామణిలో ఉన్న రూ.500.. రూ.వెయ్యి నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో దేశం యావత్తు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. అనంతరం దేశ ప్రజల వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకునేందుకు విధివిధానాలు రూపొందించిన కేంద్రం.. వాటిని అమలు చేస్తోంది.

తొలుత రూ.2వేల కొత్త నోట్లను.. రూ.100 నోట్లను ఇస్తున్న నేపథ్యంలో.. ప్రజలు చిల్లర నోట్లతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న పరిస్థితి. రూ.2వేల నోట్లుప్రజల చేతికి వచ్చినా.. వాటిని మార్చేందుకు వీలుగా చిల్లర నోట్లులేకపోవటంతో తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ ఇబ్బంది ప్రజల్లో అసంతృప్తిని రేపుతూ.. ఇప్పడిప్పుడే అసహనంగా మారుతోన్న పరిస్థితి.

నిజానికి రూ.2వేల కొత్త నోటుతో రూ.500 నోట్లను విడుదల చేసి ఉంటే.. ప్రజలకు చిల్లర కష్టాలు దాదాపుగా తీరేవి. కానీ.. అలాంటి నిర్ణయం తీసుకోకపోవటంతో నోట్ల మార్పిడికి మార్కెట్లో కటకటలాడే దుస్థితి. ఇలాంటి వేళ.. ఆదివారం సాయంత్రం కొత్త రూ.500 నోట్లు దేశంలోని పలు ప్రాంతాల్లో విడుదలయ్యాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో కొత్త రూ.500 నోట్లను బ్యాంకులు ప్రజలకు ఇవ్వటం మొదలెట్టాయి. దీంతో.. నోట్ల మార్పిడికి సంబంధించిన కొన్ని సమస్యలు కొత్త రూ.500నోట్లతో పరిష్కారం అవుతుందన్న మాట వినిపిస్తోంది. ఈ పనినే మరో రెండు రోజులు ముందే మోడీ సర్కారు తీసుకొని ఉంటే బాగుండేదని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News