పనబాక కోసం రంగంలోకి దిగిన సోమిరెడ్డి!

Update: 2020-11-25 16:15 GMT
ఎలాగైనా సరే పనబాక లక్ష్మిని ఒప్పించి ఎన్నికల్లో పోటీ చేయించేందుకు ప్రయత్నాలు మొదలైనట్లే అనిపిస్తోంది. హైదరాబాద్ లో ఉన్న పనబాక దంపతులను టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలిశారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయమై చర్చలు జరిపినట్లు ఆయనే చెప్పారు. అయితే తమ కూతురు వివాహ కార్యక్రమంలో బిజీగా ఉన్నామన్నారట. వివాహం అయిపోయిన తర్వాత చంద్రబాబునాయుడును కలిసి మాట్లాడుతామని చెప్పారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలు మార్చి నెలలోగా జరగాల్సుంటుంది. వైసీపీ ఎంపి బల్లి దుర్గాప్రసాదరావు మరణం వల్ల సీటు ఖాళీ అవ్వటంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇక్కడ నుండి పోటీ చేయటానికి పనబాక లక్ష్మిని ఎంపిక చేపినట్లు చంద్రబాబు ప్రకటించేశారు. చంద్రబాబు ప్రకటన చేసినా పనబాక మాత్రం ఎక్కడా స్పందించలేదు. తాను పోటీ చేస్తానని కానీ చేయనని కానీ ఎక్కడా చెప్పలేదు. తనను అభ్యర్ధిగా ప్రకటించినందుకు కనీసం చంద్రబాబుకు ధన్యవాదాలు కానీ కృతజ్ఞతలు కూడా చెప్పలేదు.

దీంతో అందరికీ పనబాక వ్యవహార శైలిపై అనుమానం వచ్చేసింది. ఇదే సమయంలో మాట మాత్రం కూడా చర్చించకుండానే తన పేరును అభ్యర్ధిగా ప్రకటించటంపై మాజీ ఎంపి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం పెరిగిపోయింది. పైగా గెలుపు గ్యారెంటీ లేని ఉపఎన్నికల్లో పోటీ చేయటం ఎందుకనే ఆలోచనలో పనబాక ఉందంటు టీడీపీలోనే ప్రచారం పెరిగిపోతోంది. ఇన్ని ప్రచారాలు జరుగుతున్న కారణంగానే చంద్రబాబు ఆదేశాల ప్రకారమే సోమిరెడ్డి హడావుడిగా పనబాకను కలిశారు.

ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో ఆమెపై సోమిరెడ్డి ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. చంద్రమోహన్ రెడ్డి ఎంతసేపు మాట్లాడినా ఆమె మాత్రం పోటీ విషయంలో సానుకూలంగా స్పందించలేదట. ఎన్నికల్లో అయ్యే ఖర్చు విషయాన్ని మాత్రం ఆమె ప్రస్తావించినట్లు తెలిసింది. అసలు పనబాక టీడీపీలోనే ఎన్ని రోజులుంటారనేది కూడా అనుమానమే. ఆమె బీజేపీలో చేరి అక్కడ నుండి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారనే ప్రచారం కూడా తెలిసిందే.

తమ కూతురు వివాహ విషయంలో బిజీగా ఉన్న కారణంగా ఎన్నికలో పోటీ చేసే విషయమై తర్వాత మాట్లాడుకుందామని చెప్పి పంపేశారట. ఇంతకీ పనబాక మనసులో ఏముందో ఎవరికీ అంతు బట్టడం లేదు. టీడీపీ తరపున పోటీ చేసే విషయాన్ని పక్కన పెట్టేసినా అసలు పార్టీలోనే ఉంటారా ? ఉండరా ? అనే విషయంలో కూడా నేతల్లో అయోమయంగానే ఉంది. ఆమె టీడీపీ తరపున పోటీ చేస్తే సరి. లేకపోతే ఆమె గనుక పార్టీ మారిపోయినా లేక పోటీ నుండి తప్పుకున్నా పోయేది చంద్రబాబు పరువే.
Tags:    

Similar News