ఎందుకు?; సోమిరెడ్డి గవర్నర్‌ను టార్గెట్‌ చేశారెందుకు?

Update: 2015-06-09 09:36 GMT
ఓటుకు నోటు వ్యవహారంలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తొలుత ఈ వ్యవహారంలో వీడియో సాక్షిగా రేవంత్‌రెడ్డి బుక్‌ కావటం తెలిసిందే. రేవంత్‌ వీడియోలు ఛానళ్లలో ప్రసారం కావటం.. ఆయన రిమాండ్‌కు వెళ్లటం లాంటివి జరిగిపోయాయి.

ఇది జరిగిన వారం రోజులకు ఇదే వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి టీఆర్‌ఎస్‌ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌ సంభాషణ జరిపినట్లుగా ఆరోపిస్తూ ఆడియో సీడీ ఒకటి విడుదలైంది. దీంతో.. మరోసారి భారీ కలకలం రేగింది. ఈ వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందిస్తూ.. తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీనికి ప్రతిగా కేసీఆర్‌.. చంద్రబాబును తన మాటలతో కడిగిపారేశారు.

ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారం మొత్తం కేసీఆర్‌.. జగన్‌లు ఇద్దరూ కలిసి కుమ్మక్కు అయి చేశారని..చంద్రబాబును దెబ్బ తీయటమే లక్ష్యంగా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ వివాదంలోకి రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ కూడా చేరటం ఆసక్తికర పరిణామం. సీమాంధ్రుల్ని ఇబ్బంది పెట్టేలా గవర్నర్‌ నరసింహన్‌ వ్యవహరిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత సోమిరెడ్డి తాజాగా ఫైర్‌ అయ్యారు.

తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గవర్నర్‌ నరసింహన్‌లు ఇద్దరూ కలిసి సీమాంధ్రులకు అన్యాయం చేస్తున్నారని.. రాజ్యాంగ బద్ధంగా సీమాంధ్రులకు ఉన్న హక్కుల్ని వీరిద్దరూ హరిస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో ఐపీఎస్‌ అధికారిగా పని చేసి.. చట్టాలు తెలిసిన నరసింహన్‌.. ఈ తీరులో వ్యవహరించటం సరికాదంటూ ఆయన మండి పడుతున్నారు.

కేసీఆర్‌.. గవర్నర్‌ నరసింహన్‌ మధ్య అనుబంధం గురించి సోమిరెడ్డి వ్యాఖ్యానిస్తూ.. దేవుడు కనిపిస్తే పొర్లుదండాలు పెట్టుకుంటూ పాలనను గాలి వదిలేశారని విమర్శించిన ఆయన.. గవర్నర్‌ దేవుళ్లకు మొక్కుతుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం గవర్నర్‌ను మొక్కుతున్నారని వ్యాఖ్యానించారు.

గవర్నర్‌ ఎక్కడ కనిపిస్తే ఆక్కడ కేసీఆర్‌.. ఆయన కాళ్లకు మొక్కుతున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటివరకూ లేని విధంగా గవర్నర్‌పై తెలుగుదేశం నేతలు విమర్శించటం మొదలు పెట్టారంటే.. గవర్నర్‌తో వ్యవహారం చెడిందన్న వాదన వినిపిస్తోది. తాజా వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్నట్లుగా తెలుగుతమ్ముళ్లు భావించటం వల్లే.. విమర్శల ప్రోగ్రామ్‌ మొదలు పెట్టి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి ఈ వ్యవహారంలో పెద్దలు అంతా ఒక్కొక్కరుగా వచ్చేయటం.. అందరిని ఈ వలయంలోకి తీసుకురావటం పుణ్యమా అని భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయన్నది ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News