సోమిరెడ్డి మీసం మెలేసేశారే!

Update: 2017-11-09 11:51 GMT
టీడీపీ సీనియ‌ర్ నేత‌ - ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సోమిరెడ్డికి త‌న సొంత జిల్లా నెల్లూరులో మంచి పేరే ఉంది. ఆది నుంచి టీడీపీతోనే కొన‌సాగుతున్న ఆయ‌న... మంచి అనుచ‌ర బ‌లం క‌లిగినా గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. స‌ర్వేపల్లి నియోజ‌కవ‌ర్గం నుంచి పోటీ చేసిన ఆయ‌న వైసీపీ అభ్య‌ర్థి చేతిలో ఓట‌మిపాల‌య్యారు. అయితే పార్టీలో సుదీర్ఘ కాలం పాటు కొన‌సాగుతున్న నేత‌గానే కాకుండా... గ‌తంలో చంద్ర‌బాబు తొమ్మిదేళ్ల పాటు సీఎంగా కొన‌సాగిన స‌మ‌యంలో ఆయ‌న కేబినెట్‌ లో స‌మాచార‌ - పౌర సంబంధాల శాఖ మంత్రిగా సోమిరెడ్డి త‌న‌దైన శైలిలో స‌త్తా చాటార‌నే పేరుంది. అయితే ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైనా... సోమిరెడ్డికి ప్రాధాన్యం ఇవ్వాల‌న్న భావ‌న‌తో ఆయ‌న‌ను శాస‌న‌మండ‌లికి పంపిన చంద్ర‌బాబు... ఆ తర్వాత త‌న కేబినెట్‌లో స్థానం క‌ల్పించారు. కీల‌క శాఖ అయిన వ్య‌వ‌సాయ శాఖ‌ను అప్ప‌జెప్పారు. ఇప్ప‌టిదాకా బాగానే ఉన్నా... వైరి వ‌ర్గం వైసీపీపై నిప్పులు చెర‌గ‌డంలో ఆరితేరిన సోమిరెడ్డి మంత్రి కాక‌ముందు నుంచి కూడా వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డిపై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డుతున్నారు. జ‌గ‌న్ సామాజిక వ‌ర్గానికే చెందిన నేత అయిన సోమిరెడ్డి... టీడీపీ త‌ర‌ఫున క‌త్తి తిప్పుతున్న నేత‌ల్లో మొద‌టి వ‌రుస‌లోనే నిలుస్తార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అయితే మాట‌ల‌తోనే ప్ర‌త్యర్థిని చిత్తు చేసే స‌త్తా ఉన్న సోమిరెడ్డి... చూడ్డానికి చాలా బ‌క్క‌ప‌లుచ‌గానే ఉంటారు. అయితేనేం... ఆయ‌న ఇప్పుడు మీసం మెలేసేశారు. ఏంటీ... సోమిరెడ్డి మీసం మెలేశారా? అని మ‌న‌మేం ఆశ్య‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. నెల్లూరు వెళ్లి ముత్తుకూరు సెంట‌ర్‌కు వెళితే.. మీసం మెలేస్తున్న సోమిరెడ్ది క‌టౌట్ మ‌న‌కు క‌న‌బ‌డుతుంది. అయినా సోమిరెడ్డి మీసం మెలేయ‌డానికి కార‌ణాలేమిట‌నే విష‌యం ఆ క‌టౌట్ చెప్ప‌కున్నా.. దానిని చూసిన ప్ర‌తి ఒక్క‌రూ కూడా త‌మకు తెలిసిన విశ్లేష‌ణ‌ల‌ను ప్ర‌స్తావించుకుంటూ ఆస‌క్తిక‌ర అంశాల‌ను చ‌ర్చించుకుంటున్నార‌ట‌. సోమిరెడ్డి మీసం మెలేసిన ఫొటోలు వైసీపీని ఉద్దేశించే అని చాలా మంది అనుకున్నా... నెల్లూరు జిల్లా రాజ‌కీయాల‌ను చాలా ద‌గ్గ‌ర‌గా చూసిన వారితో పాటు ఆ జిల్లాకు చెందిన వారు ఇంకో ర‌కంగానూ విశ్లేషించుకుంటున్నారు. జ‌గ‌న్‌పై సోమిరెడ్డి ఎప్పుడూ నిప్పులు చెరుగుతూనే ఉన్నారు కాబ‌ట్టి... జ‌గ‌న్‌పై మీసం మెలేసే అవ‌కాశాలు లేవ‌ని ఆ చ‌ర్చల్లో ప్ర‌స్తావించుకుంటున్నార‌ట‌.

మ‌రి సోమిరెడ్డి మీసం ఎవ‌రిపైకి గురి పెట్టింది అన్న విష‌యానికి వ‌స్తే... ఇంకెవ‌రిపైకి సొంత పార్టీ నేత‌ల‌పైకేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. నెల్లూరు జిల్లాకు సంబంధించి టీడీపీలో ఎదురు లేని నేత‌గా సోమిరెడ్డి ఉన్నా... ఆయ‌నొక్క‌రే పార్టీని న‌డ‌ప‌లేరు క‌దా. అంతేకాకుండా గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో సోమిరెడ్డి స్వ‌యంగా ఓట‌మిపాలు కాగా... ఆ జిల్లాలో మెజారిటీ సీట్ల‌ను వైసీపీనే కైవ‌సం చేసుకుంది. వైసీపీకి గ‌ట్టి ప‌ట్టున్న ఆ జిల్లాలో టీడీపీలో చాలా కుంప‌ట్లే ఉన్నాయ‌న్న‌ది జ‌గ‌మెరిగిన సత్య‌మే. మ‌రి సోమిరెడ్డి మీసం మెలేసింది... సొంత పార్టీలోని ఏ నేత‌ల‌పైకి? ఆదిలో టీడీపీలోనే ఉన్నా... ఆ త‌ర్వాత కాంగ్రెస్‌లో చేరి మొన్న‌టిదాకా హ‌స్తం పార్టీలోనే ఉన్న ఆనం ఫ్యామిలీ ఇటీవ‌లే తిరిగి సొంత గూటికి చేరింది. ఆనం బ్ర‌ద‌ర్స్‌లో ఒక‌రికి ఎమ్మెల్సీతో పాటు మ‌రొక‌రికి పార్టీలో కీల‌క ప‌ద‌వితో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓ అఎంబ్లీ సీటు కేటాయించాల్సి ఉంది. అస‌లే ఆనం బ్ర‌ద‌ర్స్‌తో సుదీర్ఘ కాలం పాటు రాజ‌కీయ వైరం నెర‌పిన సోమిరెడ్డి... ఇప్పుడు వారు టీడీపీలో చేరిపోవ‌డంతో కాస్తంత ఇబ్బందిగానే ఉన్నార‌న్న‌ది అక్కటి టాక్‌. ఈ క్ర‌మంలో వారిపైకే సోమిరెడ్డి మీసం మెలేశార‌ని కొంద‌రు చెప్పుకుంటున్నారు.

మ‌రో వ‌ర్గం చ‌ర్చ‌ల్లో జిల్లాకు చెందిన ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డితోనూ సోమిరెడ్డికి వైరం ఉంద‌న్న విష‌యం తెలిసిందే. జిల్లా పార్టీలో చ‌క్రం తిప్పేందుకు ఆదాల‌తో సోమిరెడ్డి చాలా సార్లు పోటీ ప‌డిన విష‌య‌మూ తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆదాల‌పైకే సోమిరెడ్డి మీసం మెలేశార‌న్న‌ది ఆ వ‌ర్గం మాట‌గా వినిపిస్తోంది. ఇంకో వ‌ర్గం మాట ఏంటంటే... మంత్రిగా సోమిరెడ్డి కంటే ముందుగానే కేబినెట్‌లో చేరిపోయిన మంత్రి నారాయ‌ణ ప్రాబ‌ల్యం జిల్లాలో బాగానే విస్త‌రిస్తోంది. ఈ విస్త‌ర‌ణ మ‌రింత‌గా విస్త‌రిస్తే... త‌న‌కు ఇబ్బందేన‌న్న కోణంలో సోమిరెడ్డి త‌న మీసాన్ని నారాయ‌ణ‌పైకి గురి పెట్టార‌ని కూడా చ‌ర్చ‌లు ఊపందుకున్నాయి. నేత‌ల మ‌ధ్య విభేదాలు ఎలా ఉన్నా... నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీ విష‌యంలో జిల్లాకు జ‌ర‌గాల్సిన న్యాయం మాత్రం జ‌ర‌గ‌డం లేద‌ని త‌మ్ముళ్లు తెగ బాధ‌ప‌డిపోతున్నారు. త‌న‌కు ఎదురు నిలిచే ధైర్యం చేయొద్దంటూ త‌మ్ముళ్ల‌పైకి సోమిరెడ్డి త‌న మీసాన్ని గురిపెట్టారా? అన్న కోణంలోనూ విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. కార‌ణం ఏమో తెలియ‌దు గానీ... బ‌క్క ప‌లుచ‌గా ఉన్న సోమిరెడ్డి త‌న మీసాన్ని మెలేస్తున్న ఫ్లెక్సీ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News