వైఎస్ మీద విమర్శలు సబబు కాదేమో..?

Update: 2016-06-03 17:14 GMT
ఏమాటకు ఆ మాటే చెప్పాలి. ఎవరైనా ముఖ్యనేత మరణిస్తే ఆయన్ను ఉద్దేశించి తొందరపాటుతో విమర్శలు చేసేందుకు ఎవరూ పెద్దగా ఇష్టపడరు. కానీ.. దివంగత వైఎస్ విషయంలో మాత్రం అందుకు భిన్నం. తాను బతికి ఉన్న రోజుల్లో తన రాజకీయ ప్రత్యర్థుల గొంతు విప్పేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటిది ఆయన మరణించిన తర్వాత ఎవరికి వారు ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేయటం ఆయన అభిమానుల్ని బాధకు గురి చేసే అంశంగా చెప్పాలి.

వైఎస్ తన హయాంలో తప్పులు చేయొచ్చు. కానీ.. మరణించిన వ్యక్తి మీద విమర్శలు చేస్తే దానికి ఆయన సమాధానం చెప్పలేరన్న విషయాన్ని మర్చిపోకూడదు. కానీ.. రాజకీయ ప్రయోజనాల ముందు ఇలాంటి వాదనలు ఏమీ పెద్దగా నిలబడవన్న విషయం తెలిసిందే. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి జగన్ వివాదాస్పద వ్యాఖ్య చేయటం.. ఆయన్ను ప్రజలు చెప్పుతో కొట్టాలంటూ పిలుపు నివ్వటం తెలిసిందే. దీనిపై తెలుగుదేశం నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే పలువురు తెలుగు తమ్ముళ్లు జగన్ ను టార్గెట్ చేస్తే.. టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రం జగన్ తో పాటు వైఎస్ ను టార్గెట్ చేశారు. వైఎస్ చేసిన తప్పుల్లో తన కొడుకు జగన్ ను సరిగా పెంచకపోవటం ఒక తప్పుగా ఆయన అభివర్ణించారు. జగన్ ను భరించలేక ఆయన్ను బెంగళూరు పంపించి వేశారన్నారు. ఆర్థిక నేరాలకు సంబంధించి 13 కేసుల్లో జగన్ ఏ1 ముద్దాయిగా ఉన్నారంటూ గుర్తు చేశారు. ఈ కేసుల విచారణ పూర్తి అయితే ప్రజలు ఎవరిని కొడతారో తెలుస్తుందంటూ ఆయన విమర్శించారు. జగన్ మీద ఆగ్రహం ఉంటే.. ఆయన్ను టార్గెట్ చేయటంలో తప్పు లేదు. కానీ.. పెంపకం అంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన వైఎస్ మీద విమర్శలు చేయటం సబబు కాదేమో..?
Tags:    

Similar News