మేధావి అంటూనే పవన్‌ని మోసేశాడు

Update: 2015-07-08 05:17 GMT
తమ ఎంపీల్ని చెడామడా తిట్టేసిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను తిట్టేయాలి? అదే సమయంలో అధినేతకు ఆగ్రహం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ సందిగ్థంలో చాలామంది తెలుగు తమ్ముళ్లు తప్పులు చేస్తే.. తాజాగా ఎమ్మెల్సీ అయిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాత్రం కాస్తంత తెలివితేటలు ప్రదర్శించారు. పవన్‌ని తిడుతూనే.. అధినేతకు కోపం రాని విధంగా వ్యాఖ్యలు చేసి.. తెలివైన పని చేశారన్న మాట వినిపిస్తోంది.

ఏపీ ఎంపీలకు ఆత్మాభిమానం.. రోషం లేదా? అంటూ ఫైర్‌ అయిన పవన్‌పై ఎంపీలు పలువురు విరుచుకుపడటం తెలిసిందే. ఈ విషయంలో జపాన్‌లో ఉన్న చంద్రబాబు సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ప్రభుత్వ భాగస్వామి అయిన పవన్‌ విషయంలో తొందరపాటు మంచిదికాదన్న బాబు భావనకు భిన్నంగా తమ్ముళ్లు చెలరేగిపోవటం పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.

ఇక.. అధినేతకు అగ్రహం కలగకుండా పవన్‌ని ఎలా తిట్టాలో మాటల్లో.. చేతల్లో చేసి చూపించారు సోమిరెడ్డి. పవన్‌ను మేధావిగా కీర్తిస్తూనే.. సెక్షన్‌ 8పై పవన్‌ చేసిన వ్యాఖ్యలపై సున్నితంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఆంధ్ర జాతిని అవమానించే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో సెక్షన్‌ 8 అవసరం కనిపించటం లేదా? అంటూ పవన్‌ని ప్రశ్నించారు.

మేధావి అయిన పవన్‌ ఈ విషయంలో ఆలోచించాలని.. ఆంధ్రుల హృదయాలు గాయపడ్డాయని.. అందువల్ల సీమాంధ్రులకు పెద్దదిక్కుగా ఉండే సెక్షన్‌ 8 అమలుకు సహకరించాలంటూ పవన్‌కల్యాణ్‌ లాంటి మేధావుల్ని కోరుతున్నామని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. తిట్టే సమయంలో సంయమనం.. ప్రజల తరఫున మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతూ.. విమర్శించటం సోమిరెడ్డిని చూసి తమ్ముళ్లు నేర్చుకోవాల్సింది చాలానే ఉందేమో.

.

Tags:    

Similar News