ఆత్మకూరు ఉప ఎన్నికపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!

Update: 2022-06-01 13:30 GMT
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జూన్ 23న జరిగే ఉప ఎన్నికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిపై తమకు గౌరవమున్నా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ కుటుంబ పాలనకు వ్యతిరేకమని.. అందుకే ఆత్మకూరులో పోటీ చేస్తుందన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకుందని.. ఈ నేపథ్యంలో 15 రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

15 రోజులు పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల గురించి ప్రజలకు వివరిస్తామన్నారు. అలాగే కోనసీమ జిల్లాలోని అమలాపురంలో అల్లర్లకు అధికార, ప్రతిపక్ష పార్టీలు కారణమని సోము వీర్రాజు ఆరోపించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరున బీజేపీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. తమ పార్టీకి ఎక్కడా వ్యతిరేకత లేదని తేల్చిచెప్పారు. ఓట్ల రాజకీయాల్లో భాగంగానే కోనసీమలో గొడవలకు శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. అమలాపురంలో వ్యతిరేకత ఎందుకొచ్చిందో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో జూన్ 6న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన ఉంటుందని సోము వీర్రాజు వెల్లడించారు. రాష్ట్రంలోని శక్తి కేంద్రాలను జేపీ నడ్డా సందర్శిస్తారని తెలిపారు. గోదావరి గర్జన పేరుతో రాజమండ్రిలో భారీ బహిరంగ సభను కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. వైఎస్ జగన్ ప్రజా వ్యతిరేక విధానాలపై తాము పోరాటం చేస్తామన్నారు. కాగా జేపీ నడ్డా విజయవాడలో దుర్గమ్మ దర్శనం చేసుకుంటారని తెలిపారు. అలాగే గోదావరి హారతి కార్యక్రమంలోనూ పాల్గొంటారని వివరించారు.

ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ఉందని.. అందుకే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కనిపించడం లేదని జేపీ నడ్డా తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు కేంద్రంలోనూ ఎలాంటి అవినీతి లేదన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏపీలోనూ బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక అభిమానం ఉందని చెప్పారు. కరోనాను ఎదుర్కోవడంలో ఏపీకి మోదీ ప్రాధాన్యత ఇచ్చారని సోము వీర్రాజు గుర్తు చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏపీకి రూ.70 వేల కోట్ల నిధులు ఇచ్చారన్నారు. ఆరోగ్య కేంద్రాల కోసం రూ.6700 కోట్లు ఇస్తే జగన్ ప్రభుత్వం దానికి ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టుకుందని విమర్శించారు.

అలాగే రాష్ట్రంలో 53 లక్షల మందికి ఈ శ్రమ్ కార్డులు ఇచ్చారని.. జనధన్ పథకం, ఆత్మ నిర్బర పథకం, ప్రధానమంత్రి మాతృవందన పథకం కింద కోట్లాది రూపాయలు నిధులు ఇచ్చారని సోము వీర్రాజు తెలిపారు. సుజన యోజన పథకం కింద LED బల్బులు ఇచ్చారని గుర్తు చేశారు. ఏపీకి కేంద్రం కేటాయించిన ఇళ్లు 20 లక్షలైతే.. రాష్ట్ర ప్రభుత్వం కట్టినవి 40 వేలు మాత్రమేనని విమర్శించారు. కేంద్రం అనేక పథకాలను రాష్ట్రానికి కేటాయిస్తుంటే జగన్ ప్రభుత్వం వాటిని ప్రజలకు అందించకుండా మోసపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాల కంటే మేలైన పథకాలు కేంద్రం అందజేస్తుందన్నారు.
Tags:    

Similar News