సోము మాట్లాడితే : అన్నీ ఆణిముత్యాలే సుమా...?

Update: 2022-06-03 14:15 GMT
ఆయన బీజేపీకి ఏపీ ప్రెసిడెంట్ అయ్యాక మీడియాకు మేత బాగా పెట్టేస్తున్నారు. ఏపీలో బీజేపీ ఉనికిని ఘనంగా చాటుతున్నారు. ఏపీలో బీజేపీకి ఏ మాత్రం ఓటు బ్యాంక్ ఉందేమిటి అంటే ఉన్నదంతా మనదేగా అంటారు కమలనాధులు. నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకుని రేపటి ఎన్నికలలో మేమే రాజ్యం చేస్తామని చెబితే ఎవరైనా నవ్విపోతారేమో కూడా లేదుగా.

అందుకే మన సోము వీర్రాజు గారు తెల్లారిలేస్తే చాలు మీడియా ఫోకస్ తన మీద తన పార్టీ మీద ఎలా ఉండాలా అని చూసుకుంటారులా ఉంది. ఆయన రోజుకొక తీరున  బ్రహ్మాండమైన ప్రకటనలు ఇస్తూ పార్టీకి ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు. అపుడే ఏపీలో తామే పవర్ లోకి వచ్చేసినట్లు. ఇక సమస్తమైన సమస్యలకు తామే పరిష్కారం చూపిస్తున్నట్లుగా సోము గారు ఇచ్చే బిల్డప్పులు చాలానే ఉంటాయి.

దాంతో సొము వారితో  శానా కష్టం అని పాడుకోవాల్సి వస్తోంది ఏపీ జనాలకు. అసలు సోము సార్ నోరు విప్పాలే కానీ ఆణిముత్యాలే అలా జలజలా రాలిపోతాయి. ఏ మాత్రం ఆయన మొహమాటపడకుండా తాను అనుకున్నది చెప్పడమే ఇక్కడ గ్రేట్ అన్న మాట. మేము అధికారంలోకి వస్తే అన్నది ఇపుడు ఓల్డ్ న్యూస్ అయిపోయినట్లుంది. అందుకే కాస్తా మసాలా పెంచేసి మొదటి సంతకం దాకా కధను తీసుకెళ్లారు వీర్రాజు గారు.

ఇంతకీ బీజేపీ వస్తే పెట్టే తొలి సంతకం అమరావతి రాజధాని మీదనే నట. ఏకంగా పది వేల కోట్లు కేంద్రం నుంచి తెచ్చి మరీ అమరావతి రాజధానిని మూడేళ్లలో పూర్తి చేస్తారుట. ఇలా అతి పెద్ద డైలాగునే లేటెస్టుగా  సోము వదిలారు. ఏపీ జనాల్లారా మీకిదే బంపర్ ఆఫర్ అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు.

నిజంగా ఏపీ మీద అంత శ్రద్ధ ఉంటే అటు అయిదేళ్ళ టీడీపీ ఏలుబడిలో కానీ ఇటు మూడేళ్ల వైసీపీ పాలనలో కానీ ఏపీకి దండీగా నిధులు ఎందుకు కేంద్రం నుంచి ఇప్పించలేదు సారూ అంటే మాత్రం మన వీర్రాజు గారు వీరావేశమే ఎత్తేస్తారు. అక్కడికి ఏపీ అంతా తాము తెచ్చిన నిధులతోనే కదా బతికేస్తోంది అని డబాయిస్తారు కూడా.

పోలవరం సంగతేంటని అడగకూడదు, విభజన హామీలు అసలు గుర్తు చేయకూడదు, ప్రత్యేక హోదా అన్నది కూడా సోము సార్ కి ఏ కోశానా  చెప్పకూడదు, ఎందుకంటే అవన్నీ చిన్న విషయాలు. బీజేపీకి పట్టని విషయాలు కాబట్టి. అందుకే సోము వారు అమరావతి రాజధాని ఊసు ఎత్తుకున్నారు. ఇంతకీ ఈ అమరావతి కధ ఏంటి అంటే అక్కడ సెంటిమెంట్ ఉంటే ఓట్ల పంట పండించుకుందామనే కదా.

ఇదిలా ఉంటే ఏపీలో జనసేనతో బీజేపీకి పొత్తు అని చెబుతున్న వేళ సోము సార్  కి అధికారం లోకి బీజేపీ వచ్చేయడాలు, ఫస్ట్ సంతకాలు పెట్టేయడాలూ అన్నీ కళ్ళ ముందు అలా  రీళ్ళు  తిరుగుతున్నాయి కానీ మిత్రపక్షం జనసేన సంగతి ఏంటి ఆ పార్టీ మనిషిని సీఎం ని చెస్తామని కదా చెప్పింది అన్నది కూడా గుర్తుకు రాకపోవడమే అసలైన చిత్రం. అంటే పెదవి మీదనేనా పవన్ సీఎం అన్న మాటలు అంటోంది అన్న డౌట్లు జనసైనికులకు వస్తే తప్పు వారిది కాదు కదా. ఏమంటారు సోము సార్.
Tags:    

Similar News