వీర్రాజు లేదా క‌న్నా...బీజేపీ ర‌థ‌సార‌ధి ఫైన‌ల్‌

Update: 2017-10-09 06:18 GMT
ఏపీలో బ‌ల‌ప‌డాల‌ని చూస్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇందుకు సంబంధించిన కీల‌క క‌స‌ర‌త్తును పూర్తి చేసిందా?  రాష్ట్ర శాఖలో త్వరలో మార్పులు - చేర్పులు చేయాలని హైకమాండ్ నిర్ణయించిందా?  ముఖ్యంగా రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి విష‌యంలో స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చిందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఏపీలో బ‌ల‌ప‌డాల‌ని క‌మ‌ళ‌నాథులు భావిస్తున్న‌ప్ప‌టికీ....మూడేళ్లుగా రాష్ట్ర పార్టీ అధ్యక్ష నాయ‌క‌త్వంపై సందిగ్ధత నెలకొంది. రాష్ట్రంలో మిత్రపక్షమైన టీడీపీ ఒత్తిళ్ల మేరకే ఇప్పటివరకు విశాఖపట్నం ఎంపి కంభంపాటి హరిబాబునే అధ్యక్షుడిగా కొనసాగించారనే టాక్ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఉంది. మ‌రోవైపు పార్టీ నేత‌ల్లో స్త‌బ్ధ‌త నెల‌కొంది. దీనికి చెక్ పెట్టాల‌ని పెద్ద‌లు భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందుకోసం కుల స‌మీక‌ర‌ణాలు లెక్కేసి మ‌రీ కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు - లేదా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్ప‌గించ‌వ‌చ్చ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్ర‌స్తుతం రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉన్న‌ కంభంపాటి పనితీరు పట్ల కూడా పార్టీ అగ్రనేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఓ సంఘ‌ట‌నను ఇందులో భాగంగానే ఉద‌హ‌రిస్తున్నారు. ఇటీవల రాజధానిలో పర్యటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విజయవాడలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలోకి అడుగుపెట్టకుండా వెనుతిరిగి వెళ్లడం దీనికి తార్కాణ‌మ‌ని అంటున్నారు. మ‌రోవైపు కొద్దినెలలుగా ఏపీ బీజేపీలో స్తబ్దత నెలకొంది. బూత్ కమిటీల ఏర్పాటుకు పార్టీ ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటివరకు 38వేల వరకు కమిటీల నియామకాలు జరిపారు. అయితే జిల్లాల్లో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. కొన్నిచోట్ల అర్బన్ - రూరల్ - మండల పార్టీ అధ్యక్షుల ఎంపిక పూర్తిస్థాయిలో జరగలేదు. పార్టీలో ఎవరికి వారే అనే తీరున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో రాష్ట్ర పార్టీని గాడిన పెట్టేందుకు కసరత్తు జరుగుతోంది.

మ‌రోవైపు ప్రధాని నరేంద్ర మోడీ  సారథ్యంలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు తమవిగా మలచుకునేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలపై రాష్ట్రంలో మంత్రులుగా వున్న బీజేపీ నేతలు ప్రశ్నించక పోవటం పట్ల కూడా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో తేడా వ‌స్తే టీడీపీతో అమీతుమీ తేల్చుకునే స్థాయి కలిగిన సమర్థులకే రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని భావించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇందులోభాగంగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ - ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. మరికొద్ది రోజుల్లోనే పార్టీ జాతీయ నేతల నుంచి దీనిపై ప్రకటన వెలువడే సూచనలున్నట్లు రాష్ట్ర నాయకులు చెపుతున్నారు. కన్నాకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తే వచ్చే ఎన్నికల్లో అదే సామాజిక వర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు కూడగట్టే అవకాశాలు లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావుకు అధ్యక్ష పదవి కట్టబెట్టాలనే ప్రతిపాదన ముందుకొచ్చినా ఆయన నిరాకరించిన నేపథ్యంలో కన్నానే పీఠమెక్కించాలనే యోచనతో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News