ఏపీలో ఒక్క‌ మంత్రి స్కాం జ‌స్ట్ 9000 కోట్లు

Update: 2018-07-07 10:54 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుపై బీజేపీ సీనియ‌ర్ నేత -ఎమ్మెల్సీ సోము వీర్రాజు మ‌రోమారు ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయన విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప‌రిపాల‌న‌ను ప‌క్క‌న‌పెట్టేసిన చంద్ర‌బాబు రాజ‌కీయాల గురించి మాట్లాడ‌టం చిత్రంగా ఉంద‌ని వీర్రాజు ఎద్దేవా చేశారు. బాబు పాలన అంత గాడి తప్పిందని - అవినీతిమ‌యం అయింద‌ని ఆరోపించారు. అర‌వై వేల కోట్ల అవినీతి చంద్ర‌బాబు హయాంలో విజ‌య‌వంతంగా సాగింద‌ని వీర్రాజు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇందులో ఒక్క మంత్రి వాటానే రూ.30,000 కోట్ల‌ని విమ‌ర్శ‌లు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అవినీతికి ఉపాధి హామీ పథకాలుగా మారిపోయాయని ఆరోపించారు.

త‌న‌మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రుల అవినీతి కోసం చంద్ర‌బాబు నిధుల‌న్నీ ఖర్చు చేస్తున్నార‌ని సోము వీర్రాజు ఆరోపించారు. దేశంలో ఎన్‌ ఆర్‌ జీఎస్‌ కింద సంవత్సరానికి 40వేల కోట్లు కేటాయిస్తే 9వేల కోట్లు కేవలం ఏపీకి ఇస్తున్నారు. వీటిలో పెద్ద ఎత్తున అవినీతి జ‌రుగుతోంది అని వీర్రాజు ఆరోపించారు. అర్బన్ హౌసింగ్ స్కీమ్‌ లో సుమారు 30 వేల కోట్ల అవినీతి జరిగిందని - మట్టి-నీరు పథకంలో మరో 30 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. `బడ్జెట్‌ లో విద్యకు 30 వేల కోట్లు కేటాయించారు. వీటిలో 8 నుంచి 9 వేల కోట్లు చేతులు మారుతున్నాయి. విద్యకు కేటాయించిన నిధులన్నీ మంత్రి నారాయణ పరమవుతున్నాయి`` అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అంతేకాకుండా ``సర్వశిక్షాఅభియాన్‌ లో పోస్టులు అమ్ముకుంటున్నారు. గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు - ఎల్‌ ఈడీ బల్బులు - ఇల్లులు - 24 గంటల కరెంట్ - నీరు చెట్టు - ప్రధాన మంత్రి భీమా - మరుగుదొడ్లు వంటి వాటిని కేంద్రమే భరిస్తుంది. ఆ సొమ్ముతో రాష్ట్రంలోని ఉన్న ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేయొచ్చు. కానీ టీడీపీ నేత‌ల అవినీతితో ఈ నిధుల‌న్నీ ప‌చ్చ పార్టీ నేత‌ల జేబుల్లోకి చేరుతున్నాయి. త‌ద్వారా ప‌నుల‌న్నీ ఎక్క‌డ వేసిన గొంగ‌డి అక్క‌డే అన్న‌ట్లుగా ఉంద‌ని ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీ అవినీతికి తోడుగా రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని అప్పుల కుప్ప‌గా చేసి ప్ర‌జ‌ల నెత్తిన భారం మోపుతున్నార‌ని వీర్రాజు ఆరోపించారు. ఇప్ప‌టికే వ‌స్తున్న నిధులు కాకుండా అప్పుల‌ను తెస్తూ రాష్ర్టాన్ని మ‌రింత రుణ‌భారంలోకి నెట్టేస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. తెలుగుదేశం పార్టీ నేత‌ల‌కు అస‌హ‌నం పెరిగిపోయి త‌మ నాయ‌కుల‌పై దాడులు చేయిస్తున్నార‌ని వీర్రాజు ఆరోపించారు. బీజేపీ బలం పెరుగుతుందనే టీడీపీ నేతలు త‌మ పార్టీ నాయకులపై దాడులు చేయిస్తున్నార‌న్నారు.
Tags:    

Similar News