పవన్ వ్యాఖ్యలపై వాయిస్ ఇచ్చేసిన సోము వీర్రాజు

Update: 2022-05-09 10:58 GMT
మరో రెండేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ఏపీలో హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కారు వ్యతిరేక ఓటు చీలనివ్వమంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా స్పష్టంగా చెప్పటం తెలిసిందే.

ఇదే విషయాన్ని నిన్న కర్నూలు జిల్లా పర్యటనలోనూ ఆయన మరోసారి నొక్కి వక్కాణించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు కల్పించుకొని.. పొత్తులపై క్లారిటీ ఇవ్వాలంటూ పవన్ ను అడిగే క్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఈ మధ్యన చేసిన కామెంట్ ను ప్రస్తావించింది.

టీడీపీతో పొత్తుకు తాము వ్యతిరేకమని సోము వీర్రాజు అన్నారని.. మరి దీనికి మీరేం చెబుతారని పవన్ ను అడిగేశారు మీడియా ప్రతినిధులు. దీనికి స్పందించిన పవన్ కల్యాణ్.. ఒక నవ్వు నవ్వి.. సోము వీర్రాజు అలా అన్నారా? అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న తమ మధ్య ఇప్పటివరకు పొత్తు ఉండదనే మాటను చెప్పారు. ఏదో అద్భుతం జరుగుతుందంటూ టీడీపీ పొత్తు మీద మాత్రం పెదవి విప్పలేదు.

పవన్ వ్యాఖ్యలపై సోము వీర్రాజును స్పందించమని అడిగారు మీడియా ప్రతినిధులు. దీంతో స్పందించిన ఆయన.. పొత్తుల విషయంలో తాము క్లారిటీగానే ఉన్నామన్నారు. బీజేపీ.. జనసేన పొత్తు కొనసాగుతుందన్న ఆయన.. జనసేన-టీడీపీలు కలుస్తాయా? లేదా? అన్నది జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను అడగాలని.. ఆయన నోటి వెంటే ఆ మాటలు వినాలన్నారు.

గతంలో టీడీపీతో పొత్తుకు తాము వ్యతిరేకమని కుండబద్ధలు కొట్టిన సోము వీర్రాజు.. తాజాగా మాత్రం టీడీపీ -జనసేన పొత్తుపై వివరాల్ని పవన్ ను అడగమన్న తీరు భిన్నంగా ఉందని చెప్పక తప్పదు.

చూస్తుంటే.. ఏదో లెక్క తేడా కొట్టినట్లుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా గతంలో మాదిరి సోము వాయిస్ కఠినంగా కాకుండా కాస్త తేడాగా ఉందన్న మాట వినిపిస్తోంది. చూస్తుంటే.. పవన్ నోటి నుంచి ఆదివారం వచ్చిన.. ఏదో అద్భుతం జరుగుతుందన్న మాట నిజమయ్యేలా అనిపిస్తోంది. ఇదెంత వరకు నిజమో కాస్త వెయిట్ చేస్తే మరింత క్లారిటీ వచ్చేయటం ఖాయం.
Tags:    

Similar News