నచ్చని పేరు పెట్టినందుకు పేరెంట్స్ మీద కేసు పెట్టాలట

Update: 2022-10-09 13:30 GMT
విచిత్రమైన అనుభవం ఎదురైంది సంగారెడ్డి పోలీసులకు. డయల్ 100కు వచ్చిన ఒక ఫోన్ కాల్ సారాంశంతో వారి నోటి వెంట మాట రాని పరిస్థితి. తన తల్లిదండ్రులు పెట్టిన పేరు తనకు నచ్చటం లేదని.. తనకు ఆ పేరు పెట్టిన పేరెంట్స్ మీద కేసు పెట్టేందుకు తాను కంప్లైంట్ ఇస్తానన్న కుర్రాడి మాటలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక షాక్ తిన్నారు పోలీసులు.

సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ లో నివాసం ఉండే సురేష్ అనే కుర్రాడు డయల్ 100కు ఫోన్ చేశాడు. తన తల్లిదండ్రుల మీద కేసు పెట్టాలని పోలీసులకు చెప్పాడు. తనకు నచ్చని పేరు పెట్టిన వారిపై కేసు పెట్టాలన్న యువకుడ్ని పోలీసులు.. స్టేషన్ కు రావాలని కోరారు. సురేశ్ పేరులో తేడా ఏమీ లేదు కదా? ఎందుకు నచ్చలేదని అనునయంగా అడిగారు. దానికి అతడు చెప్పిన రీజన్ విన్న వారు ఆశ్చర్యపోయారు.

తన తల్లిదండ్రులకు మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ అంటే చాలా ఇష్టమని.. ఆ ఇష్టంతో తన పేరును సురేశ్ గా పెట్టారని కుర్రాడు తెలిపాడు. అయితే.. తనకు ఆ పేరు నచ్చదని.. అందుకే పేరెంట్స్ మీద కేసు పెట్టాలని పోలీసుల్ని ఆశ్రయించినట్లు చెప్పాడు. దీంతో.. అతగాడికి నచ్చ చెప్పిన పోలీసులు. అలా తల్లిదండ్రుల మీద ఉత్తినే కేసులు పెట్టటం సాధ్యం కాదని.. కౌన్సెలింగ్ ఇచ్చి మరీ ఇంటికి పంపారు. ఈ ఉదంతం పోలీసుల వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమైంది.
Tags:    

Similar News