సోనియా ఆవేద‌న‌..ప్ర‌ణ‌బ్ ఇలా చేశారేంటి?

Update: 2018-06-07 13:38 GMT
మాజీ రాష్ట్రపతి - కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ...సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌గా ఆయ‌న రాజ‌కీయాల్లో ఎంత చ‌ర్చ‌నీయాంశంగా నిలిచారో...తాజాగా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం ఫ‌లితంగా మ‌రోమారు హాట్ టాపిక్ అయ్యారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఆహ్వానం మేరకు నాగ్‌ పూర్ వెళ్లడం దేశ‌వ్యాప్తంగా అన్ని పార్టీల్లోనూ చ‌ర్చ‌నీయంగా మారింది. ప్రణబ్ కూతురే ఆయన నిర్ణయాన్ని తప్పుబట్టిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ప్రణబ్‌ పై సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె సూచన మేరకు సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ ఓ ట్వీట్ చేశారని అంటున్నారు.

గురువారం సాయంత్రం 6 గంటలకు ఆరెస్సెస్ కార్యక్రమం మొదలుకానుంది. ప్రణబ్‌ ను ఈ ఈవెంట్‌ కు వెళ్లకుండా అడ్డుకోవడానికి కాంగ్రెస్ చాలానే ప్రయత్నించింది. మాజీ కేంద్ర‌మంత్రి జైరామ్ రమేష్ సంఘ్ స‌మావేశానికి వెళ్లొద్దని కోరారు. మరో సీనియర్ చిదంబరం మాత్రం.. `మీరు వాళ్ల ఆహ్వానాన్ని మన్నించారు.. అక్కడికి వెళ్లి వాళ్ల సిద్ధాంతంలో ఎలాంటి తప్పిదాలు ఉన్నాయో చెప్పండి` అని ప్రణబ్‌ను కోరడం గమనార్హం.  సీనియర్ లీడర్ ఆనంద్ శర్మ ఆయనతో మాట్లాడి ఈవెంట్‌ కు వెళ్లొద్దని వారించారు. అయినా ప్రణబ్ మాత్రం నాగ్‌ పూర్ వెళ్లారు. ఇలా వివిధ ర‌కాలుగా కాంగ్రెస్ ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ ప్ర‌ణ‌బ్ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈ నేప‌థ్యంలో అహ్మద్ పటేల్ ఓ ట్వీట్‌ లో సోనియా భావాలను వ్యక్తం చేశారు. `ప్రణబ్.. మీ నుంచి నేను ఇది ఊహించలేదు` అని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) సమావేశంలో ప్రసంగించేందుకు సిద్ధమైన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయంతో ఆయన కుమార్తె - కాంగ్రెస్ నేత శర్మిష్ఠ విభేదించారు. షర్మిష్ఠ ముఖర్జీ కూడా ఓ ట్వీట్ చేస్తూ.. `ఇది బీజేపీకి మేలు చేసే చర్యే అవుతుంది. ఆర్ ఎస్ ఎస్ సమావేశంలో ప్రసంగించడమంటే తప్పుడు ప్రచారాలకు అవకాశమివ్వడమే` అని ఆమె వ్యాఖ్యానించారు. `ఏం మాట్లాడామన్నది అందరూ మరిచిపోతారు. దృశ్యాలు మాత్రమే గుర్తుండిపోతాయి. ఆ సమావేశంలో ప్రసంగించడం అంటే.. తప్పుడు వార్తలు ప్రచారంలో పెట్టేందుకు ఆర్ ఎస్ ఎస్ - బీజేపీలకు పూర్తిగా అవకాశమిచ్చినట్లే` అని ఆమె పేర్కొన్నారు. ఆర్ ఎస్ ఎస్‌ ను కట్టుకథల ప్రచార సంస్థగా శర్మిష్ఠ అభివర్ణించారు. పర్యవసానాల గురించి ఆలోచించాకే సమావేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారా? అని తండ్రి ప్రణబ్‌ ను ఆమె ప్రశ్నించారు. తాను బీజేపీలో చేరుతానంటూ వస్తున్న వార్తలను తోసిపుచ్చిన ఆమె ఇలాంటి దుష్ప్రచారాలు కూడా బీజేపీ - ఆర్ ఎస్ ఎస్ పనేనని పేర్కొన్నారు.

Tags:    

Similar News