ఈ సోయి విభజన అప్పుడేమైంది సోనియమ్మ?

Update: 2016-07-21 06:55 GMT
పవర్ మత్తుమందు కంటే ప్రమాదకరమైంది. ఒక్కసారి దాని టేస్ట్ చూసిన తర్వాత ఒక పట్టాన దాన్ని విడిచి పెట్టేందుకు ఏ మాత్రం ఇష్టపడరు. పదేళ్లు దేశాన్ని రిమోట్ కంట్రోల్ తో ఏలేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లాంటి వారికి చేతిలో పవర్ లేకుండా చాలా కష్టమే. దీనికి తోడు.. వరుసగా వస్తున్న ఎన్నికల్లోనూ దెబ్బ మీద దెబ్బ పడుతున్న వేళ.. సోనియమ్మ ఆగమాగమైపోతున్నారు. ఇక.. కేంద్రంలో నానాటికి స్థిరపడుతున్న మోడీ తీరు ఆమెను మరింత అసహనానికి గురి చేస్తుంది. అందుకే.. ఏ చిన్న అవకాశం దొరికినా.. మోడీ సర్కారు మీద విరుచుకుపడుతున్నారు.

తాజాగా నిర్వహించిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా మోడీ తీరును తీవ్రస్థాయిలో విమర్శించిన ఆమె.. వ్యవస్థల్ని మోడీ సర్కారు ఎలా అస్థిరపరుస్తుందో చూస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. సమాజాన్ని విభజించేందుకు కుట్రలు చేస్తున్నారని.. రాజ్యాంగ విలువల్ని కాలరాచే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

‘‘పార్లమెంటులో వారికున్న మెజార్టీని వారి సిద్దాంతాల్ని ప్రజలపై రుద్దేందుకు లైసెన్సుగా భావిస్తున్నారు. రాజ్యాంగం ఎంతో పవిత్రమైనదంటూ చెబుతూనే మరోపక్క దానికి తూట్లు పొడిచే చర్యల్ని ప్రోత్సహిస్తున్నారు. అరుణాచల్.. ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఇదే తరహాలో అనైతిక చర్యలకు పాల్పడ్డారు. స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉండటంతో  దాని జోక్యంతో రాజ్యాంగ విలువలు నిలబడ్డాయి’’ అని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న మోడీ ఎలా చెలరేగిపోతున్నారో ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. తాము పవర్ లో ఉన్నప్పుడు చేసిన ఘనకార్యాల గురించి మర్చిపోవటం గమనార్హం.

ఏపీ విభజన బిల్లు విషయంలో సభలో తమకున్న మెజార్టీని దృష్టిలో పెట్టుకొనే కదా.. హడావుడిగా.. పార్లమెంటు తలుపులు మూసేసి.. టీవీ ప్రసారాలు నిలిపి వేసి మరీ బిల్లును పాస్ చేయించిన విషయాల్ని ఎవరు మర్చిపోగలరు. ఈ రోజు సుద్దులు చెబుతున్న సోనియా.. పవర్ చేతిలో ఉన్నప్పుడు మోడీనే కాదు.. తాను కూడా తనకు తోచినట్లే చేశానన్న విషయాన్ని గుర్తు చేసుకుంటే మంచిది.
Tags:    

Similar News