సోనియా తెలంగాణ తల్లి.. చంద్రబాబు తెలంగాణ తండ్రి

Update: 2021-07-09 02:46 GMT
తెలంగాణలో మాటల మంటలు అంటుకున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన రేవంత్ రెడ్డి సభలో కేసీఆర్ సర్కార్ పై చేసిన విమర్శలకు మంత్రి కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. వివాదాస్పద రీతిలో తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు విమర్శలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

ఇన్నాళ్లు రేవంత్ రెడ్డి వేసే సెటైర్లు, కౌంటర్లకు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు పెద్దగా స్పందించేవారు కాదు..రేవంత్ రెడ్డి ఒక ఎంపీ అని ఊరుకునేవారు. తమ స్థాయి దిగజార్చుకోకూడదని అటు కేసీఆర్, ఇటు కేటీఆర్ అసలు కౌంటర్లు ఇచ్చేవారు కాదు.. కానీ ఇప్పుడు పీసీసీ చీఫ్ అయ్యాక రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపై మాత్రం మంత్రి కేటీఆర్ గట్టి కౌంటర్లు ఇచ్చారు. ఏకంగా విరుచుకుపడ్డారనే చెప్పొచ్చు.

రేవంత్ రెడ్డి విమర్శలను తిప్పికొట్టడమే కాదు.. ఆయనపై ఓ రేంజ్ లో సెటైర్ల వర్షం కురిపించారు. ‘గతంలో ఇదే రేవంత్ రెడ్డి టీడీపీలో ఉండగా సోనియాగాంధీని ఎన్ని తిట్లు తిట్టాడో యూట్యూబ్ లో కొడితే వస్తాయి.. ఆమె తెలంగాణ తల్లి కాదు.. తెలంగాణలో 1200 మందిని చంపేసి బలిదేవత అన్నాడు. ఈరోజు ఆమెను తెలంగాణ తల్లి అంటున్నాడు.. ఇలానే వదిలేస్తే రేపోమాపో చంద్రబాబు నాయుడిని తెలంగాణ తండ్రి అని కూడా అంటాడు’ అని మంత్రి కేటీఆర్ ఎన్ కౌంటర్ చేసేశాడు..

కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టే రేవంత్ కు ఓ పదవి దొరికిందని.. ఓ 2 రోజులు ఇలానే హంగామా చేస్తారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఇప్పటికీ టీడీపీలో ఉన్నట్టే ఫీల్ అవుతున్నాడని.. కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశంలా మార్చే ప్రయత్నం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఎంతైనా పాత వాసనలు పోవడం లేదని సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి రాకతో తెలంగాణ కాంగ్రెస్ లో ఓరకమైన గందరగోళం నెలకొందన్నారు.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన మనిషి.. తమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేశారంటున్నాడు.. ఇంతకంటే గమ్మత్తు ఏముంటుంది.. కొనుడు-అమ్ముడు గురించి రేవంత్ కంటే గొప్ప ఎవ్వరికి తెలియదు.. నోట్ల కట్టలతో కెమెరా ముందు అడ్డంగా దొరికిపోయినాడు ఈరోజు నీతి మాటలు మాట్లాడుతున్నాడు అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగాడు..

ఇన్నాల్లు రేవంత్ రెడ్డి ఎన్ని తిట్టినా గమ్మున ఉన్న టీఆర్ఎస్ నేతలు అతడిని అస్సలు లెక్కలోకి తీసుకోలేదు. కానీ పీసీసీ చీఫ్ అయ్యాక ప్రధాన పోటీదారుగా మారడంతో ఇప్పుడు ఎంత మాత్రం ఉపక్షించేది లేదని కౌంటర్లు ఇస్తున్నారు. ఈ ఫైట్ తెలంగాణ రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
Tags:    

Similar News