కాంగ్రెస్ ఆఫీస్‌కు అద్దె క‌ట్ట‌ట్లేదా?

Update: 2022-02-11 04:30 GMT
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ త‌ను ఉంటున్న నివాసానికి అద్దె క‌ట్ట‌డం లేదా?  ప‌పార్టీ ఆఫీసుకు కూడా రెంట్ చెల్లించ‌డం లేదా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప్ర‌భుత్వ‌ అధికారులు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం, సోనియా గాంధీ అధికారిక నివాసం సహా మరికొందరు కాంగ్రెస్ నేతలు ఉంటున్న భవనాలకు అనేక ఏళ్లుగా అద్దె చెల్లించడం లేదని తెలిసింది. కాంగ్రెస్ ఆఫీసుకు సంబంధించి ప్రభుత్వానికి రూ.12.69 లక్షలు బకాయి ఉన్నట్లు సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా తెలిసింది.

ప్ర‌బుత్వ అధికారులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు రూ.12,69,902 ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయ భవనం అద్దె బకాయి. ఉండ‌గా, రూ.4,601.. సోనియా గాంధీ అధికారిక నివాసం అద్దె బాకీ ఉంది.  అదేవిధంగా రూ.5,07,911.. సోనియా వ్యక్తిగత కార్యదర్శి నివాసం అద్దె బకాయి ఉన్న‌ట్టు స్ప‌ష్ట‌మైంది. సుజిత్ పటేల్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా.. కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ చెప్పిన లెక్కలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం.. ఢిల్లీ అక్బర్ రోడ్లోని 26వ నెెంబర్ భవనంలో ఉంది. 2012 డిసెంబర్ తర్వాత ఆ భవనం అద్దెను చెల్లించలేదు. మొత్తం రూ.12 లక్షలకుపైగా బకాయి పడింది. జాతీయ, రాష్ట్ర పార్టీలకు ప్రభుత్వ భవనాల కేటాయింపునకు స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఆయా పార్టీలు సొంత భవనం కట్టుకునేందుకు మూడేళ్లు సమయం ఇస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే.. 2010 జూన్లోనే ఢిల్లీ రౌజ్ ఎవెన్యూలో కాంగ్రెస్ పార్టీకి భూకేటాయింపు జరిగింది.

అయినా.. భవన నిర్మాణం పూర్తి కాలేదు. 2013లోనే అక్బర్ రోడ్ కార్యాలయాన్ని కాంగ్రెస్ ఖాళీ చేయాల్సి ఉంది. అయితే.. అనేక సార్లు ఆ గడువు పొడిగిస్తూ వ‌చ్చారు.  2020 జులైలో లోధి రోడ్లోని ప్రభుత్వ భవనాన్ని నెల రోజుల్లోగా ఖాళీ చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కేంద్రం నోటీసులిచ్చింది. ఫలితంగా అప్పుడు ప్రియాంక వేరే ఇంటికి మారాల్సి వచ్చింది.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జనపథ్ రోడ్లోని 10వ నెంబర్ ఇంట్లో ఉంటున్నారు. 2020 సెప్టెంబర్ నుంచి ఆ భవనం అద్దె చెల్లించలేదు. రూ.4,610 బకాయి ఉంది. చాణక్యపురిలోని C-11/109 భవనంలో సోనియా వ్యక్తిగత కార్యదర్శి విన్సెంట్ జార్జ్ ఉంటున్నారు. ఆ భవనం అద్దెను 2013 ఆగస్టు నుంచి చెల్లించలేదు. మొత్తం బాకీ రూ.5,07,911.

బీజేపీ వ్యంగ్యాస్త్రాలు:

కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేత‌లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో ఓడిపోయాక సోనియా గాంధీ అద్దె చెల్లించలేకపోతున్నార‌ని, ఇప్పుడు కుంభకోణాలు చేయడానికి వీలు లేకపోవడమే ఇందుకు కారణమన్నది సుస్పష్టమ‌ని పేర్కొన్నారు. అయితే.. రాజకీయ భేదాభిప్రాయాలు పక్కనబెట్టి మానవత్వంతో  ఆమెకు సాయం చేయాలని అనుకుంటున్నాన‌ని  బీజేప‌పీ నేత త‌జింద‌ర్ పాల్ సింగ్ బ‌గ్గా పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న  #SoniaGandhiReliefFund  ప్రారంభించి ఆమె ఖాతాకు  10 రూపాయలు బదిలీ చేశారు.
Tags:    

Similar News